శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం
ఆంధ్రప్రదేశ్ నందు గల గ్రామ దేవతాలయములలో శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం సుప్రసిద్ధమై మహిమాన్వితమై ప్రాముఖ్యత వహించిన దేవస్థానం. కమ్మవారి ఆడపచుచు సతీసహగమన కారణమున 17 వ శతాబ్దం చివరి కాలమున పెద్దాపురంలోని మనోజి చెరువు సమీపమునందు గ్రామ దేవతగా వెలిసినది.
ఆ కాలంలో ఈ చెరువు చుట్టుప్రక్కల ప్రదేశము చిట్టడవిగా ఉండేడిది. ఒకసారి మన్యం నుండి పశువులను తోలుకొని వచ్చు పశువుల కాపరులతో కాలినడకన వచ్చిన పదహారేండ్ల యువతి మనోజ్ చెరువు ప్రాంతమునకు రాగానే వారితో నేను చింతపల్లి వారి ఆడపడుచును, నేను ఇచ్చట ఉన్నానని మా వారికి తెలుపుము అని పలికి అంతర్ధానమయ్యింది. ఈ వింత సంఘటనను కాపరులు చింతపల్లి గ్రామంలోని వారందరికీ చెప్పిరి. ఆ రాత్రి వారికి పసుపు పూసిన ఒక కర్ర కనిపించింది. దానిని తీసుకునే అక్కడే ఒక తాటాకు పాకవేసి అక్కడ ప్రతిష్ఠ చేసి, ధూప, దీప నైవేద్యములు పెడుతూ ఆరాధించసాగారు.
చుట్టుప్రక్కల గ్రామప్రజలు కూడా వచ్చి అమ్మవారిని ఆరాధించసాగారు. మహమ్మారి కలరా జాడ్యము నుండి రక్షించు దేవతగా ఈ అమ్మవారిని మారమ్మగా పిలిచెడి వారు. కాలక్రమమున మరిడమ్మ గా పేరుగాంచెను. ఆషాఢమాసంలో వచ్చు కలరా జాడ్యము నుండి ప్రజలు రక్షింపబడుటచే ప్రజలు ఆషాఢమాసమునందు అమ్మవారికి పూజలు, జాతరులు, తిరునాళ్లు చేయు ఆచారం వచ్చింది. ఇటీవలి కాలంలో అమ్మవారి ఆలయం ఆధునాతనంగా తీర్చిదిద్దబడి, నిత్య వేద పఠనాదులతో సశాస్త్రీయమైన పూజాది కార్యక్రమములతో నిత్య యాత్రాస్థలముగా రూపొందించబడి ప్రకాశించుచున్నది.
శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవ
భక్తుల తలపులను నెరవేర్చు తల్లిగా శ్రీ తలుపలమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధి చెందారు. అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా తియ్యటి పాతాళ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండ ధారకొండగా ప్రసిద్ధి చెందింది దీనికి ఆనుకుని ఉన్నదే తీగకొండ. దట్టంగా తీగలు అలుముకుని ఉన్న చెట్లతో ఈ కొండ నిండుగా ఉంటుంది. ఈ రెండు ధార, తీగ కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో కూర్చుంది ఆ చల్లని తల్లి, లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు శ్రీలలితా దేవి అంశ.
స్థల పురాణం…
కృత యుగంలో ధీరునిగా పేరుపొందిన మేరు పర్వతుని గర్వాన్ని అణచి దక్షిణ దేశ యాత్రకు వచ్చిన అగస్త్య మహాముని ఒక అరణ్య మార్గంలో వెళుతుండగా సంధ్యావందన సమయం అయింది. త్రికాలాలలో సంధ్యావంధనం చేసుకునే అగస్త్యునికి ఆ అడవిలో ఎక్కడా చుక్క నీరు కనబడలేదు. త్రికాల సంధ్యావందనానికి ఆర్ఘ్యం సమర్పించాలని తలచిన అగస్త్యుడు అప్పటికే సూర్యస్తమయ సమయం దగ్గరపడటం గమనించి పాతాళగంగని ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుని ప్రార్ధన విన్న పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పెల్లుబికి ఒక లోయలోకి ప్రవహించింది. ఈ విధంగా ఏర్పడ్డ పవిత్ర పాతళగంగతో అగస్త్య మహాముని సంధ్యా వందనం ఆచరించాడు. ఆ పుణ్య సమయంలో సాక్షాత్తు జగజ్జనని శ్రీ లలితాంబాదేవి అగస్త్యునికి ప్రత్యక్షమై బలహీనులు, అల్పాయువులైన మానవులను రక్షించేందుకు తాను ఆదిశక్తిగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నానని తెలిపింది. అప్పుడు అగస్త్యుడు లలితాదేవి ప్రణమిల్లి భక్తులు తలుచుకున్న తడవునే కోరిన వరాలు ఇచ్చే తల్లిగా ఈ లోయలో పాతాళగంగ సమీపాన పీఠంపై వెలిసి ఉండుమని ప్రార్ధించిన ఫలితంగా ఆ తల్లి తలుపులమ్మగా నిలిచిందని పురాణకథ. కాలక్రమేణ ఆ లోయే లోవగా రూపాంతరం చెందింది. అమ్మవారి ఆలయసన్నిధికి వచ్చే భక్తులకు తీయని నీరు లభించాలని అగస్త్యుడు కోరిన వల్లే తలుపులమ్మ పాతాళ గంగ నీటిని తియ్యటి నీరుగా మార్చింది. అమ్మవారిని దర్శించే భక్తులకు ఇప్పటికీ ఆ పవిత్ర గంగను సేవించే భాగ్యం లభిస్తుంది. ఇది తలుపులమ్మ అద్భుతం.
సకల సౌభాగ్య ప్రదాత…
తూర్పుగోదావరి జిల్లా లోవ పుణ్యక్షేత్రంలో వేంచేసిన శ్రీ తలుపులను అమ్మవారు తనను దర్శించిన భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. సర్వ కిరీట ధారిమై రూపంలో స్వయంభువుగా శ్రీ లలితా దేవి అంశంగా అమ్మవారు కొండ గుహలో కొలువైయున్నారు. అమ్మవారి మూలవిరాట్కు కుడి ప్రక్కన అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహాన్ని, ఎడమ వైపు అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు. వెనుకవైపు అమ్మవారి పెద్ద ప్రతిమ పసిడి కాంతులను ప్రసరిస్తూ, కొలచిన భక్తులకు వరాలను ప్రసాదించే తల్లిగా జగన్మాతగా దర్శనమిస్తుంది.
దర్శన ఫలం…
ముఖమంతా పసుపు ఛాయతో చల్లని చూపులతో దీవెనలను అందించే తలుపులమ్మ అని దర్శించిన మత్తయిదువలు బ్రతుకంతా కుంకుమ కాంతులతో వర్ధిలుతారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శిస్తే మదిలో తలపులు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించి ఆలయం వెనుక పాయలను చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాహనాల యాజమానులు, డ్రైవర్లు ము కొత్త, పాత వాహనాలతో లోవ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించి, వాహనపూజలు చేయిస్తే వాహనాలకు అవరోధాలు ఎదురుకావని గట్టినమ్మకం.
శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, రాజమండ్రి
ఈ చివ్యక్షేత్రములో త్రిపీఠములుగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేంకటేశ్వర స్వామి ప్రతిష్టితమైనారు . వేణుగానం చేస్తున్న మువ్వ గోపాలుని భంగిమలో సాలగ్రామ శిలారూపాన్ని దర్శించిన భక్తులను మైమరపించే మూర్తితత్వంలో వేణుగోపాలస్వామి మూలవిరాట్ (విగ్రహము) 18 వ శతాబ్దము నాటిదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మహ్మదీయుల దండయాత్ర మూలంగా స్వామి వారి మూల విరాట్ కు స్థానచలం కలిగి గోదావరి తీరంలో పును ప్రతిష్ట జరిగింది. 18 వ శతాబ్ది చివరి నాటికి శ్రీ స్వామివారి ఆలయం దివ్యక్షేత్రంగా మలచబడింది. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో లక్ష్మీదేవి, గోదాదేవి కొలువైయున్నారు. పూర్వకాలం నుండి అందం వారి వంశపారంపర్యంగా స్వామికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి పవిత్ర గోదావరి నదీతీరంలో వున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. రాజమహేంద్ర వరానికి క్షేత్ర పాలకుడిగా వేణుగోపాల స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. మహా ప్రళయ కాలంలో గోవిందుడిన వసించి యున్నాడని పురాణులు పేర్కొంటున్నాయి. వ్యాస తనయుడైన శ్రీ శకుడు, గోవిందున అనుగ్రహించే ఇచటనే మహాభాగవత సాంఖ్యతంత్ర కర్తయైనాడు. వీటికి సంకేతంగా పరాశర మహా గోవర్ధన పర్వతముతో గోవిందుడను గోపాలుని రూపంలో ప్రతిష్టించినాడు.
అమరేశ్వర స్వామి ఆలయం, అమరావతి
గుంటూరునకు 35 కి.మీ. ల దూరాన వున్న అమరావతిలో అమరేశ్వర స్వామి ఆలయం వుంది. అమరావతిని పంచారామాలలో ఒకటయిన అమరారామం అని అంటారు. ఇది చాలా ప్రాచీన క్షేత్రం . అయితే, ఇక్కడ అభించిన శాసనాలలో ధమ్మకడ (ధరణికోట) లేక ధాన్యకటకం అన్న పేర్లే కాని అమరావతి అన్న పేరు కన్పించదు. ఈ శాసనాలలో మొదటిది ఆశోకుని కాలం నాటిది. దీనిని సందర్శించిన వారిలో క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందిన యువాన్ చ్వాంగ్ అను చైనా యాత్రికుడు వున్నాడు. ఈ ప్రాంతాన్ని మాండలికులుగా పాలించిన కోటరాజులు (12 వ శతాబ్దం) అమరేశ్వర పాద భక్తులుగా తమను తాము వర్ణించుకొన్నారు. కొండవీటి రాజయిన అనవేమారెడ్డి 1361 లో అమరేశ్వరుని పునఃప్రతిష్ఠ చేసినట్లు ఒక శాసనం తెలుపుతోంది. 1626 లో జుజ్జూరు గ్రామానికి చెందిన పెద్దప్ప అమరేశ్వరుని పునఃప్రతిష్ఠ జరిపినట్లు శాసనంలో తెలిపాడు పునఃప్రతిష్ఠ ఎందుకు జరిపింది ఇద్దరూ తెలపలేదు. 1796 లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇక్కడ ఒక నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకొన్నాడు. ఆయన అమరేశ్వరాలయాన్ని పునరుద్ధరించాడు. బహుళా అమరావతి అన్న పేరు ఆయనే పెట్టి వుండవచ్చని ఒక ఊహ వుంది.
రెండు అంతస్తులుగా విస్తరించిన ఈ శివలింగాన్ని ఇంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని దేవతలు, కిన్నరులు, యక్షులు ఇక్కడ పూజలు చేసేవారనీ పురాణగాథ. ప్రస్తుతం పై అంతస్తులోని శివలింగ భాగాన్ని మాత్రమే ప్రజలు దర్శించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఈ పుణ్యతీర్థం దగ్గర కృష్ణానది కొద్దిదూరం వాయువ్యదిశగా ప్రవహించడం చెప్పుకోదగిన అంశం. మిగతా నది అంతా పశ్చిమం నుంచి తూర్పుదిశగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అమరావతి ఆలయంలో లింగం చాల పొడవుగా వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథ ప్రకారం ఈ లింగం పెరుగుతూ వుండేదట. అందువలన ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగుచెంది అర్చకులలో వొకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో లింగం పెరుగుదల ఆగిందట. దీనిని నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని (నెత్తుటి) చారికలను చూపిస్తారు. మేకు కొట్టినప్పుడు డారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలతలో 60 అడుగుల ఎత్తు వుంటుంది. భక్తిశ్రద్ధలతో మూడు రోజులు వరుసగా కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వరుడిని పూజించిన వారు మరణానంతరం శివ సాన్నిధ్యం పొందుతారని భక్తుల విశ్వాసం. ఇక్కడ కొలువుతీరిన అమ్మవారు బాలదాముండిక చుట్టూ నాలుగు గోపురాలు ఉన్న ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో నిర్మించినట్లు పురావస్తుశాఖ పేర్కొంటోంది. అమరావతిలో ఒకప్పుడు బౌద్ధ స్తూపం వుండేది. అది అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు, మరుగున పడిపోయిన ఆ స్తూపపు అవశేషాలను వెలికి తీసి ఆంగ్లేయులు చాలవరకు లండన్ మ్యూజియానికి తరలించారు. అమరావతి శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. పోగా మిగిలిన కళాఖండాలను ఇక్కడ నెలకొల్పిన మ్యూజియంలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బుద్ధ భగవానుని ఆస్థికాశశేషాలున్న స్పటికపు భరిణె లభించింది. భారతీయ శిల్పకళకు అమరావతి కళ శిరోభూషణమని కళాకోవిదులు వ్రాశారు. అమరావతి కళ తనదైన ఒక బాణీని ఏర్పరచుకొని అమరావతి శిల్పరీతిగా ప్రపంచ ప్రస్థిది పొందింది.
చిలుమూరు
ప్రాచీన దేవాలయ క్షేత్రం. కృష్ణ తీరాలలో వెలసిన ఉభయ రామేశ్వరం చిలుమూరు. పుష్పక విమానంలో ప్రయాణం చేస్తున్న సీతారాములు ఈ ప్రాంత రమణీయతకు పరవశించి ఇక్కడ దిగారట. అర్చన చేసుకోవడానికి ఆలయమేదీ లేని కారణాన సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తీ ఇక్కడి ఉభయ తీరాలలోనూ లింగ ప్రతిష్ట కానిచ్చి, కొద్దిరోజులు ఇక్కడ వశించినట్లు ఇక్కడివారు చెప్తారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో ఉన్న ఈ ఆలయానికి గుంటూరు నుంచి కానీ, తెనాలి నుంచి కానీ బస్సులలో చేరవచ్చు. ఒక లింగం చిలుమూరులోనూ, మరొకటి నది ఆవలి ఒడ్డునున్న అయిలూరులోనూ ప్రతిష్టించి రెంటికీ కలిపి ఉభయ రామేశ్వరమని సాక్షాత్తు ఆ శ్రీరాముడే నామకరణం చేశాడట. తర్వాత పక్కనే ఒక వేణుగోపాల ఆలయం కూడా నిర్మించారు. చైత్ర పౌర్ణమి నాడు ఇక్కడ తిరునాళ్లు జరుపుతారు.
పానకాల నరసింహ స్వామి ఆలయం, మంగళగిరి
మంగళగిరి గోపురం ఎంతో ఎత్తుగా వుంటుంది. మంగళగిరి గోపురంలా ఎత్తుగా వున్నాడన్న నానుడి కూడ అందువల్లనే బయలుదేరింది. మంగళగిరి విజయవాడకు 7 మైళ్ల దూరంలో జాతీయ రహదారిపై వుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస బ్రహ్మతై వర్త పురాణంలో వుండటం వల్ల యిది ప్రాచీన క్షేత్రం అని చెప్పవచ్చు. చైతన్య మహా ప్రభువు శ్రీ వల్లభాచార్యులు ఈ స్వామిని దర్శించారట. ఇక్కడి కొండమీద పానకాల నరసింహస్వామి ఆలయం వుంది. ఇక్కడి స్వామికి ఎంత పాత్రతో పానకం పోసినా అందులో సగం త్రావి, సగం వెలికి జొక్కటం జరుగుతుంది. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వుంది. దీని ముందున్న ఎత్తయిన గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడు. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తరువాత గోపురం ఉత్తర దిక్కుగా వొరిగిందట. తరువాత దక్షిణ భాగాన ఒక కోనేరు త్రవ్వించగా గోపురం తిన్నగా నిలబడిందని చెబుతారు.
కొండవీడు
గుంటూరు నుండి 25 కి.మీ. దూరంలో ఉన్నది . దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మింపబడిన అతి పురాతనమైన కోట ఉన్నది. కొండపై ఉన్న ఈ కోటను రుక్మిణి, శ్రీనాథుడు, వేమన, గజపతి వంశక్షత్రియుడు విశ్వంభర దేవుడు నిర్మించినారని చరిత్రలో ఉన్నది. పూర్వం ఈ కొండవీడు నిత్యం నృత్యము, సంగీతం కోలాహలాలతో, వీరుల సింహనాదాలతో, విజయగర్జనలతో ఎల్లప్పుడూ అత్యంత కోలాహలంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఒక మహాసామ్రాజ్యానికి రాజధానిగా ఉండేదట. యాత్రికులకు చరిత్రాత్మకతతో పాటు చుట్టూ చక్కటి ప్రకృతి వలన మనసు హృద్యంగా ఉండటం సంభవిస్తుంది.