ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీకాళీ విశ్వేశ్వరాలయం…

సుమారు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీశైవ మహాపీఠం ఆధ్వర్యంలో అతి స్వల్ప వ్యవధిలో భాగ్యనగర్ లోని నాగోలు జైపురి కాలనీ సమీపంలోని శివపురిలో అత్యంత శోభాయమానంగా శ్రీకాళీ విశ్వేశ్వరాలయ నిర్మాణం జరగడం విశేషంగా చెప్పుకోవాలి.

ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, సనాతనధర్మ పరాయణతను హృదయమంతా నింపుకుని అనుక్షణం విశ్వమానవశాంతికి పరితపిస్తున్న మహానీయులు శ్రీ శైవమహాపీఠాధిపతులు సద్గురు శివానందమూర్తి చేతుల మీదుగా 2006 ఆగస్టులో శ్రీకాళీ విశాలాక్షీ సమేత శ్రీకాళీ విశ్వేశ్వర విగ్రహస్థిర ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ వైభవంగా జరిగాయి. భారతదేశంలోనే అరుదయిన అత్యంత మహిమాన్విత స్ఫటిక లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. “సామ్రాజ్యం స్ఫటి కందద్యాత్” స్ఫటికలింగ దర్శన మాత్రంచేత సకల ఐశ్వర్యాలు, పాలనా దక్షత కలుగుతుంది అని శివగీత చెబుతోంది. కోటికాంతి కిరణాలతో భాసిల్లే స్ఫటికలింగమూర్తి, కాశీ విశాలాక్షి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, వీరాంజనేయ, చండికేశ్వర, కాలభైరవ రాహు, కేతు నవగ్రహ ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఇక్కడ మనకు దర్శన మిస్తాయి.

స్ఫటికలింగమూర్తి

శ్వేత కాంతు లీనుతూ, పరమపవిత్ర కాంతి పుంజాలు వెదజల్లుతూ కాశీ విశ్వేశ్వరుని రూపంలో ఉన్న స్ఫటిక లింగమూర్తి దర్శనమిస్తాడు. విశ్వేశ్వరస్వామి వారికి హారతి ఇచ్చిన తరువాత ఆ హారతి పెట్టిన ప్రతికార్యాన్ని విజయ పధంవైపు నడిపించడానికి తరలి వచ్చిన విజయ గణపతి సుందర సుమనోహర విగ్రహం కాంచగానే విజయోత్సాహంతో మనసంతానిండి పోతుంది.

సుబ్రహ్మణ్య స్వామి ఆలయం

సర్వశుభంకరుడు, సంతాన ప్రదాత సుబ్రహ్మణ్యస్వామి సంతాన లేమితో బాధపడుతున్నవారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుని సత్ఫలితాలు పొందుతున్నారు.

వీరభద్రుడు, భద్రకాళి మందిరం…

దుష్టున శిక్షణకు, దురంహంకారులకు, దుర్మదాంధుల సంహారణకు, సకలాయుధ ధా అయి అరివీర భయంకర రూపంలో ఉన్న విరభద్రస్వామి, భర్తకు తోడుగా నిలిచిన భద్రకాళి కనిపిస్తారు. రాహుకేతువులకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి విశేషం.

నవగ్రహాలకు గుడి

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నెలకొల్పిన నవగ్రహ దేవతామూర్తుల విగ్రహాల సందర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ఇవికాక చండికేశ్వర విగ్రహం, కాల భైరవ విగ్రహం, నందీశ్వరుడు, మూషికవాహనం, సింహ వాహనం ఆలయ ప్రాంగణానికి మరింత నిండు తనాన్ని సంతరింపచేస్తున్నాయి. భక్తకోటితో నిత్యం కళకళలాడుతూ శోభాయమానంగా కనిపించే ఈ ఆలయ సముదాయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి తీరాలి.

తాడ్ బండ్ వీరాంజనేయుడు

భాగ్యనగరంలో సైనిక పురి సమీపంలోని సిక్ విలేజ్ దగ్గర పూర్వం తాడ్బంద్ అనే గ్రామం ఉండేది. అక్కడ వెలసిన వీరాంజనేయుడే తాడ్ బంద్ వీరాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని పొదల్లో ఒక పెద్ద గుండ్రాయి బయటపడింది. ఆ గుండ్రాయి పై వీరాంజనేయుడు సుందర రూపంలో చెక్కబడి దర్శనమిచ్చాడు. ఇక్కడే స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించారు. భూరు వీరయ్య, కొండా రఘురాములు, ఎప్పల వీరమల్లయ్య, సోమనరసయ్యలు స్వామివారికి గుడి కట్టించటంలో ముఖ్యపాత్ర వహించారు. ఇక్కడ ఆలయం కట్టించింది దాదాపు ఎనభై సంవత్సరాల క్రితమై అయినా ఇక్కడ లభించిన వీరాంజనేయుల వారి ప్రతిమ మాత్రం ఇక్ష్వాకుల కాలం నాటిదని చెపుతారు. రామాయణ కాలంలో జాబాలి మహర్షి ప్రతిష్టించిన మూడు ఆంజనేయ విగ్రహాలలో ఇదొకటి . రెండవది హృషీకేశ్ లోను, మూడవది తిరుపతిలోను ఉన్నాయి. వీటిని జాబాలి క్షేత్రలంటారు.

భక్తుల కొంగు బంగారం మహంకాళి అమ్మవారు…

లష్కర్ ప్రజలనే కాకుండా నగర ప్రజలకు ఆరాధ్య దైవంగా సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు విరాజిల్లుతున్నది. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈ అమ్మవారిని ప్రజలు కోలుస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరిగే మహంకాళీ జాతరకు నగరం నుండే కాకుండా తెలంగాణ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి ఈ జాతరలో పాలుపంచుకుంటారు. ఇక్కడ మహంకాళీ అమ్మవారిని భక్తులు ఏమి కోరుకున్నా అది జరగుతుందని నమ్మకం ఉండడం వల్లనే రోజు రోజుకు అమ్మవారి దర్శనానికి భక్తుల రాక అధికమవుతున్నది. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వందలాది మంది భక్తులు రాగా, శుక్రవారం మాత్రం వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంకా జనరల్ బజార్ జ్యూయలరీ షాపు, పలు షాపింగ్ మాల యాజమానులు, సిబ్బంది కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా ముందుగా ఆశీస్సులతోనే ఇక్కడ తమ వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరుగుతూ వస్తుంది. అమ్మవారి ఆశీస్సులుంటే వ్యాపారంలో అగ్రగామిగా నిలుస్తామని ఇక్కడి వ్యాపారులకు గట్టి నమ్మకం. ఇలా సాధారణ ప్రజానీకం మొదలు, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని కోల్చుకోవడంతోపాటు కానుకలను సమర్పించుకుంటారు. అంతటి మహత్యం ఉన్న ఈ ఆలయానికి ఘన చరిత్రే ఉంది.

ఆలయ చరిత్ర…

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళీ దేవాలయానికి దాదాపు 196 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. 1813 వ సంవత్సరంలో మిలిటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్ వాస్తవ్యులు సురిటి అప్పయ్య (ఆర్మీసోల్జర్) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని టవరకు బదిలీ అయినారు. బదిలయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించడం జరిగింది. ఆ సమయంలో అప్పయ్య వారి అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహంకాళీ దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడాలని వేడుకున్నారు. పరిస్థితిలు అనుకూలించిన తదుపరి సికింద్రాబాద్లోనే విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయ నిర్మాణం చేసి నిన్ను కోల్చుకుంటామని మొక్కుకోగా, కలరా వ్యాధి నుండి అనేక వేల మంది రక్షింపబడ్డారు.

తదనంతరం సురిటి అప్పయ్య వారి అనుచరులు సికింద్రాబాద్కు తిరిగివచ్చి 1815 సంవత్సరంలో ఇప్పుడు అమ్మవారు ఉన్న చోట కట్టెతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ట చేసి నిత్య పూజలు చేయడం జరిగింది. అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళీ అని నామకరణం అప్పట్లోనే చేశారు. పూర్వం ఈ ప్రాంతమంతా చెట్లు, చేమలు, కొండరాయి మొదలగు వాటితో నిండి ఉండేది. ఇక్కడొక పెద్ద బావి ఉండేదని, దానిని మరమత్తు చేయుచున్న సమయంలో త్రవ్వకాల్లో “శ్రీ మాణిక్యాల దేవి” విగ్రహం దొరికింది. ఇదియే ఇప్పుడు గర్భాలయమునందు కుడివైపున ఉన్నది. శ్రీ మాణిక్యాల దేవి అమ్మవారి ప్రక్కన ప్రతిష్టించుట జరిగింది.

సూరిటీ అప్పయ్య 1864 సంవత్సరంలో కట్టె విగ్రహం తీసేసి ఇప్పుడున్న మహంకాళీ మాణిక్యాల దేవి అమ్మవారుల విగ్రహాలను శాస్రోక్షముగా ప్రతిష్టించేసి ఆలయనిర్మాణం చేయడం జరిగింది. నాటి నుండి వారి తరువాత వారి వంశస్తుల సురిటి సంజీవయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, సురిటి లక్ష్మయ్య కుమారుడు సురిటి అప్పయ్య మునిమనువడు సురిటి కృష్ణ ప్రస్తుతం జాతర కార్యక్రమాల్లో పాల్గొనుచున్నారు. శాస్త్రానుసారంగా నిత్యపూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ దేవాలయమును 1953 సంవత్సరంలో దేవాదాయ ధర్మదాయ శాఖవారి ఆధీనంలోకి తీసుకోని భక్తుల సౌకర్యార్థం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది.

దక్షిణ షిర్డిగా వెలుగొందుతున్న దిల్సుఖ్నగర్ షిర్డీ సాయిబాబా మందిరం…

విజయవాడ జాతీయ రహదారి పక్కన ప్రాంతం. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మనస్సును ఉల్లాసంగా ఉంచే భక్తి పాటలు, భజనలతో మారుమోగుతుంటాయి. ఎంతో రణగొణధ్వనులు ఉన్నా ఈ ప్రాంతానికి చేరుకునే సరికి సాయినామ స్మరణతో ప్రశాంతత చేకూరి మనస్సు తన్మయం చెందుతుంది. తమను కాపాడే దైవం ఇక్కడే ఉన్నాడని, అదే దిల్ సుఖ్ నగర్ షిర్డీ సాయిబాబా దేవాలయం అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం దిల్ సుఖ్ నగర్ లోనే ఉన్నా అచ్చం షిర్డీ సాయిబాబా దేవాలయం నమూనాతో నిర్మాణం కావడంతో పాటు ఇక్కడి సాయినాధుని దర్శించుకుంటే షిర్డీ సాయినాధుని దర్శించుకున్నట్టే అనే భావన భక్తుల్లో కలుగుతుండడంతో ఈ ఆలయానికి దక్షిణ షిర్డీగా నామకరణం జరిగింది. సాయిబాబా దేవాలయాలు ఎన్నో నిర్మాణం అవుతున్నప్పటికీ దిల్ సుఖ్ నగర్ బాబా ఆలయానికి ఉన్న గుర్తింపు ఎంతో ప్రాముఖ్యమైనది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులే కాక వివిధ రాష్ట్రాల నుండి వచ్చే టూరిస్టులు ఈ ఆలయాన్ని దర్శించుకుని తన్మయం చెందుతుంటారు . మొదట్లో చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం నేడు మూడంతస్తుల భవనంతోపాటు సాయినాధుని ఆదేశాల మేరకు అన్నట్లుగా సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం సాయినాధుని పాలరాతి విగ్రహం వలె ఉండడం, దానికి తోడు ఇక్కడికి వచ్చే భక్తుల కోర్కెలు బాబా ఆశీర్వాదంతో తీరుతుండడం, ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల కోలాహలంతో రద్దీగా కనిపిస్తుంది.

చిన్న ఆలయం నుంచి…

దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఆదిలో సాయిబాబా ఆలయం చిన్న తడికెలతో ప్రారంభమైంది . స్థానికులు కొందరు ఎంతో వ్యవ ప్రయాసల కోర్చి ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. అనంతరం పలువురు ట్రస్ట్ చైర్మన్లు, పాలక మండలి నేతృత్వంలో బాబా దేవాలయం నుండి 1984 లో దేవాలయ గర్భగుడి నిర్మాణం చేపట్టగా, 1989 లో ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పాత విగ్రహాన్ని ఆలయం ఎడమ వైపు ప్రతిష్టించారు. ఆలయంలోకి ప్రవేశించగానే ద్వారకామాయిలోని ధుని, సాయిబాబా వారు ఉపయోగించిన వస్తువులు దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ఎంతో సుందరంగా తీర్చి దిద్దిన అలంకరణలు భక్తులను అలరిస్తాయి. 1991 లో మొదటి అంతస్తు నిర్మాణం చేసి పైన ధ్యానమందిరం ఏర్పాటు చేశారు. 1993 లో సాయిబాబా దేవాలయం ప్రధాన ఆర్చ్ ని జాతీయ రహదారి పక్కన నిర్మించారు. 1994 లో సాయినాధునికి ఆరు లక్షల వ్యయంతో స్వర్ణ కిరీటాన్ని ఆలంకరించారు. 1996 లో ఆలయానికి రెండవ అంతస్తు నిర్మాణం చేసి ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా పక్కన ఉన్న స్థలాన్ని తీసుకుని అక్కడ కూడా భవన నిర్మాణం చేసి పిఆర్‌ఓ రూము, అధ్యాత్మిక గ్రంధాలయాన్ని, మొదటి అంతస్తులో అన్నదాన సత్రాన్ని నిర్మాణం చేశారు. ఇలా ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది.

భక్తిభావంతోపాటు ప్రతినిత్యం సేవా కార్యక్రమాలు…

సాయిబాబా దేవాలయం ట్రస్ట్ వారు దేవాలయం అభివృద్ధితో పాటు దాతల సహకారం, భక్తుల తోడ్పాటుతో పలు సమాజ, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేవాలయం ప్రాంగణంలోనే ఉచిత వైద్యశాల ఏర్పాటు చేసి రోగులకు సేవ చేస్తున్నారు. 26 మంది నిపుణులైన వైద్యులతో హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. లక్షల రూపాయల వ్యయంతో ఈ వైద్య సేవలు అందిస్తున్నారు. అదే విధంగా ఆలయం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి కూడా సేవలందిస్తున్నారు.

చికెన్ గున్యా, పోలియో, సీజనల్ వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉపద్రవాలు వచ్చినా ఆపన్నులను ఆదుకోవడం కోసం విరాళాలు సేకరించి పంచడం వంటి కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ వర్గాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆలయం ద్వారా వెయ్యి మంది భక్తులకు చేపట్టే అన్నదాన కార్యక్రమం పలువురి మన్ననలు పొందుతోంది. ప్రతినిత్యం సుమారు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి హారతులతో పాటు పూజలు నిర్వహించబడతాయి. ప్రతి రోజూ సాయంత్రం భజనలు, సంగీత ప్రార్ధనలు, ప్రతి గురువారం పురవీధుల గుండా సాయి పల్లకి ఊరేగింపు, గురుపౌర్ణమి, శ్రీరామనవమి, దసరా తదితర పండుగలు ఘనంగా నిర్వహించడం విశేషం.

ప్రత్యంగిరా దేవి

లక్ష సింహ ముఖాలతో.. భగభగమండే కేశాలతో… త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలో ఉంది . శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, దర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. కాని ఉగ్ర స్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో కృత్య గాను దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు) లోని అయ్యావరే అడవిలో నికుంఖిలగాను, ఇలా కొన్నిచోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మవారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభయ్యేళ్లుగా ఎన్నో గ్రంధాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానససరోవరం, కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణి దర్శించి పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో (రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలో) ని కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్టించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర, భైరవి, భగళాముఖీ, దూమావతి, మాతంగి, షోడశి (లలితాత్రిపురసుందరి), కమలాత్మిక (లక్ష్మీదేవి) అమ్మవార్లను ప్రతిష్ఠించారు. శత్రుసంహారం, దారిద్ర్యనివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిరి. ఏలినాటి శని దోషంతో భాదపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజ ద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు.

దుష్ట శిక్షణార్ధం…

సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సందించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుడ్ని ఏమి చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెలుసుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట, దాంతో వారిద్దరు తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్ధించారట, అప్పుడు ఆదిపరాశక్తి లక్ష సింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడిని అతని సైన్యాన్ని సంహరించిందట.

లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం. అదర్వణవేదంలోని మంత్రాలతో ఈ అమ్మవారి ప్రస్థావన వస్తుంది కాబట్టి అదర్వణ భద్రఖాళీ అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అని… ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.

ఇంద్రజిత్తు ఆరాధన…

ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, దర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసందుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నీకుంబిల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని ఏదైన యుద్దానికి వెళ్ళే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు బలులు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యధాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలు పెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానర సేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగ మండపాన్ని, యజ్ఞాన్ని ద్వంసం చేశారట, సమయం మించిపోతుండడంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కుని అతని చేతిలో హతమయ్యాడట. మంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రఘంట (నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా దరించాడట, ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు… పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుందని నమ్మిక. నిత్యం లలితాసహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *