సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ధర్మపురి మొదలయిన క్షేత్రాల వలెనే యాదగిరిగుట్ట కూడ పేరుపొందిన నారసింహ క్షేత్రం. ఇది హైదరాబాదుకు సుమారు 65 కి.మీ. దూరంలో వుంది. కొండ పైన గల గుడి వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కాజీపేట రైలు మార్గంలో యాదగిరిగుట్టకి దగ్గరలో రాయగిరి స్టేషన్ కూడ వుంది.

ఋష్యశృంగుని కుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపై తపస్సు చేశాడట. ఆయనకు విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు నారసింహుని మూడు అంశలతో దర్శనం అను గ్రహించమని కోరాడట. అప్పుడు స్వామి గండభేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలు ధరించి కనిపించాడు. ఎప్పటికీ స్వామిని అలాగే తన కళ్ల ముందు వుండవలసిందని యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపై వెలిశాడట.

స్వామి వెలసిన స్థలం కొండ పైన గల గుహలో వుంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తీర్చి దిద్దారు. లోనికి దిగేముందు పంచముఖ ఆంజనేయస్వామి కోవెల వుంది. ఈ స్వామికి అయిదు ముఖాలుండటం ప్రత్యేకత. ఆంజనేయస్వామి గుడి వున్న బండపై గండభేరుండ నరసింహమూర్తి వుంది. గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ మూర్తులు వున్నాయి. విశాలంగా చేసినప్పటికీ లోపలకు వెళ్లే సమయంలో, కొంచెంగా తల వంచుకొని వెళ్లాల్సి వుంటుంది.

యాదగిరి గుట్ట నరసింహస్వామికి భక్తుల రోగాలు నయం చేస్తాడన్న ప్రఖ్యాతి వుంది. ఎక్కడా కుదరని రోగాలు యిక్కడకు వచ్చి స్వామిని సేవిస్తే తగ్గుతాయని భక్తుల నమ్మకం. కొందరు రోగులు స్వామి తమ కలలో కన్పించి శస్త్ర చికిత్స కూడ చేసినట్లు తమ అనుభవాలను తెలియజేయటం జరిగింది. ఈ కొండపై నీటి ఎద్దడి కలుగగా బావి త్రవ్వించేందుకు ఆలోచిస్తున్న రోజులలో అప్పటి ఆలయ నిర్వహణాధికారి శేషారావు గారికి కలలో స్వామి కన్పించి ఫలానా చోట బావి త్రవ్వించమని ఆదేశించారని ఎందరు వద్దన్నా వినక, అదే స్థలంలో బావి త్రవ్వగా స్వచ్ఛమైన తీయటి జల సమృద్ధిగా పడిందని చెబుతున్నారు. గర్భగుడిలో లక్ష్మి , నరసింహుల ఉత్సవ విగ్రహాలు వున్నాయి. గోదాదేవి మందిరం వేరే వుంది. నృసింహ పుష్కరిణి (కోనేరు) కొండపై వుంది. దీనిని యాదవ మహర్షి త్రవ్వాడని చెబుతారు. దీనిని గురించిన ప్రస్తావన స్కాంద పురాణంలో వుంది. కొండపై గల అద్దాల మండపం చూడదగ్గది. కొండపైననే శివాలయం కూడ వుంది.

కమనీయం కళాధామం – సురేంద్రపురి

దేవతామూర్తులను సహజంగా సృష్టించిన కళాద్భుతం ఇది. పౌరాణిక ఘట్టాలలో అపురూప దృశ్యాలను కళాఖండాలుగా రూపొందించి కళాప్రియులకే కాకుండా పర్యాటకులకు కూడా కనువిందు చేసే సర్వదేవలోక సన్నిధానం మన రాష్ట్రంలో యాదగిరి గుట్టకు సమీపంలో ఏర్పాటైంది.

భాగ్యనగరానికి దగ్గరలో యాదగిరిగుట్ట సమీపంలో సుందర సురేంద్రపురిలో అత్యంత మనోహరమైన కుందా సత్యనారాయణ కళాధామం పేరుతో పౌరాణిక విజ్ఞాన కేంద్రం ప్రజల సందర్శనానికి సిద్ధమైంది.

దివ్య శోభాలంకృతమైన ఈ కళాధామంలో అపురూప కళాఖండాలు ఏర్పాటయ్యాయి. సంపూర్ణ భారతదేశ ప్రముఖ యాత్రలన్నీ సర్వదేవతలతో ఒకేచోట సురేంద్రపురిలోని కళాధామంలో తిలకించవచ్చు. రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలలోని ప్రధాన ఘట్టాలను శిల్పాలుగా మలిచి నయనమనోహరంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కురుక్షేత్రంలోని పద్మవ్యూహం, దేవీ భాగవతంలోని పద్మద్వీపం (మణిదీపం), క్షీరసాగర మధనం, గజేంద్రమోక్షం, కాళీయ మర్థనం, గోపికా వస్త్రాపహరణం, గంగావతరణం, మహిషాసురమర్ధిని దృశ్యాలను కమనీయంగా చిత్రించారు.

కళాదరామం ప్రత్యేకతలు

బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, నాగలోకం, పాతాళ లోకాలే కాక అనేక లోకాలు, ఎందరెందరో దేవతామూర్తులు ఈ కళాధామంలో దర్శనమిస్తారు. మేఘాలు, హంసలతో ఆహ్లాదకర వాతావరణంలో బ్రహ్మ, సరస్వతి తామర పుష్పంలో ఆసీనులై ఉండడం చూపరులను ఆకర్షిస్తుంది. సప్తరుషులు, మానస పుత్రులు, నవబ్రహ్మలు ఇక్కడ దర్శనమిస్తారు. పాల సముద్రంలో శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు శయనించడం, లక్ష్మీదేవి పాదసేవ చేయడాన్ని కడు రమ్యంగా చిత్రించారు.

నాగలోకంలో నాగరాజు, రాణి, యువరాణి, నాగ సైనికులతో భీముడు బంధించబడి ఉన్న దృశ్యం సముద్రగర్భంలో ఉన్న అనుభూతిని కల్గిస్తుంది.

నరకలోకంలో వైతరణీ నది ప్రవహిస్తుండగా యమభటులు శిక్షలు అమలుచేసే దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

అమ్మలకు అమ్మ అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆనంద నిలయమే అద్భుత పద్మద్వీపం. సకల ఏదేవతామూర్తులు నవదుర్గలతో కొలువుతీరిన పీఠం దిగువ భాగాన మహా మహిమాన్వితమైన సాక్షాత్తూ వైష్ణవీదేవిని ఇందులో చూడవచ్చు. గోవర్ధన గిరిని ఎత్తడం, రాసక్రీడలు, రాక్షసులను సంహరించిన శిల్ప ఘట్టాలు దర్శనమిస్తాయి. హనుమంతుడు స్వహస్తాలతో ప్రసాదమివ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఆవు పొదుగునుంచి అప్పటికప్పుడే వేడిపాలతో టీ, కాఫీ తాగే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

కోటి సర్ప ప్రతిమలు

నాగకోటీశ్వరం దృష్టా నాగదోషా వినశ్యతి అని శాస్త్రం చెబుతోంది. నాగాభరణంతో ఉన్న కోటి శివలింగ ప్రతిమల్ని ఒకే చోట దర్శించుకుంటే నాగదోషం పోతుందని దాని అర్ధం. అలాంటి ఆలయమే నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గర్లో ఉన్న నాగకోటీశ్వరాలయం. జాతకంలో నాగ, కాలసర్ప, కుజదోషాలున్న భక్తుల కోసమే ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించడం విశేషం. సాధారణంగా ప్రతీ ఆలయంలోనూ మూల విగ్రహం ఒకటి ఉంటుంది. కానీ ఇందులో కోటి పార్థివ లింగాలను నాగప్రతిమతో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నాయి. కాబట్టే దీనికి నాగకోటి ఆలయమని పేరు పెట్టారు.

అపూర్వమైన ఆలోచన…

హైదరాబాద్ లో ఉండే జ్యోతిష్కులు గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి దగ్గరికి కాలసర్ప దోషం ఉన్న భక్తులు ఎక్కువగా వచ్చేవారు. పరిహారం కోసం వాళ్లను చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయానికో వెళ్లమని ఆయన సూచించేవారు. కానీ అందరూ అంతదూరం వెళ్లలేరు. అంత ఖర్చూ పెట్టుకోలేరు . కొందరికి రెండు మూడు రోజులు కేటాయించే తీరికా ఉండదు. అలాంటి వారికోసం రాజధానికి దగ్గర్లోనే ఒక ఆలయాన్ని నిర్మిస్తే బావుంటుందని ఆయనకు అనిపించింది. అప్పుడు చాలా గ్రంథాలను తిరగేసి, ఎందరో పండితులనూ పీఠాధిపతులనూ సంప్రదించి, వారి సలహాల మేరకు నాగకోటి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు దివ్యజ్ఞాన సిద్ధాంతి. కానీ, ఆలయ నిర్మాణమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఆయన ఒక్కరివల్లా సాధ్య కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ‘సురేంద్రపురి’ వ్యవస్థాపకులు కుందా సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. నాగకోటి ఆలయ నిర్మాణ ఆలోచనను ఆయనతో చెప్పారు. సురేంద్రపురి ప్రాంగణంలో అప్పటికే అనేక దేవతాలయాలు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకమైన ఆలయమూ ఉంటే బాగుంటుందని కుందా సత్యనారాయణ కూడా అంగీకరించడంతో సురేంద్రపురికి అనుబంధంగానే నైరుతి భాగంలో నాగకోటి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

లక్షమది భక్తులు

మూల విగ్రహాలను శిల్పకారులు చక్కగా చెక్కుతారు. కానీ నాగకోటి ఆలయంలో ప్రతిష్టించడానికి కావలసింది అలాంటి రాతి విగ్రహం కాదు. ఏకంగా కోటి సర్ప శివలింగాలు అవీ పుట్టమన్నుతో చేసినవై ఉండాలి. మరి వాటిని తయారుచేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే దీని కోసం ఒక ఆలోచన చేశారు. కాలసర్పదోషం ఉన్న వాళ్లే 40 రోజులు దీక్ష చేపట్టి, ఒక్కో భక్తుడూ మట్టితో చేసిన 108 సర్ప లింగాల్ని తీసుకురావాలని నియమం పెట్టారు. పార్థివ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి అనగా నాగ పంచమినాడే ఆలయ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు కొందరు భక్తులతో పార్థివ సర్ప లింగాల నమూనాలను తయారు చేయించారు. అలా రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఆలయ నిర్మాణం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుమారు లక్ష మంది భక్తులు శివలింగాన్ని స్వయంగా చేసి తెచ్చారు. 2009 అక్టోబర్ 31 న ప్రతిష్టాపనా మహోత్సవం జరిగింది.

శివలింగమే ఆలయం

ఈ ఆలయాన్ని పెద్దకొండపై ఏర్పాటు చేశారు. పానపట్టంతో ఉన్న శివలింగంపై అయిదు పడగల నాగాభరణం ఉన్నట్టు నిర్మించిన ఈ ఆలయం ఎత్తు 101 అడుగులు. ఈ శివలింగాకారం లోపల సిమెంటుతో చేసిన దేవతల విగ్రహాలు ఏర్పాటుచేశారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళితే నాగకోటి శివ లింగాలకూ ప్రదక్షిణ అవుతుంది. అలా సర్పసహితంగా ఉన్న కోటి లింగాల దర్శనమూ ప్రదక్షిణమూ జరుగుతాయన్నమాట.

ఆలయ తూర్పు ద్వారంగుండా వెళ్లగానే మొదట గణపతి, గరుత్మంతుడు దర్శనమిస్తారు. తర్వాత లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, బ్రహ్మసరస్వతులు, వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి, రాహు కేతువులతో కొలువైన నాగేశ్వరుడు కనిపిస్తారు. జాతకంలో కాలసర్పదోషమూ, నాగదోషాలూ ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. విఘ్నాలూ సమస్యలతో పెళ్లిళ్లు ఆగిపోయినవాళ్లూ, సంతానం కలగనివారూ కూడా ఆలయానికి వస్తుంటారు. ఆలయంలో సర్పసూక్తం, సుబ్రహ్మణ్యస్వామి అష్టాక్షరితో నెలకొకరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగపంచమికి (శ్రావణ మాసంలో), నాగులచవితికీ కార్తీకమాసంలో ఇక్కడ విశేష ఉత్సవం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి నాగకోటీశ్వరాలయం కేవలం 55 కి.మీ. దూరంలో ఉంది. నాగకోటిని దర్శించుకున్నాక కిలోమీటర్ దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు కూడా వెళ్ళి రావచ్చు. ఆలయం నలువైపులా ఎటుచూసినా కొండాకోనలూ ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల్ని ఎంతో ఆకట్టుకుంటుంది.

ఫణిగిరి

సూర్యాపేట నుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ ఫణిగిరికి రెండు వేల సంవత్సరాల నాటి ఘనచరిత్ర ఉన్నది. అలనాటి ఫణిగిరి వైభవాన్ని ఇక్కడ ఉన్న బౌద్ధ అవశేషాల ద్వారా, చైతన్య గృహాలద్వారా, స్థూపాల ద్వారా మనం చూడవచ్చు. తిక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం దర్శించదగినది. ఇక్కడ కట్టడాలన్నీ బలంగా, గట్టిగా ఎంతో ప్రామాణికంగా ఉంటాయి.

మట్టపల్లి

నల్గొండ నుండి 60 కీ.మీ. దూరంలో ఉన్నది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆలయంలో స్వామి ఎల్లప్పుడు భక్తులకు ఆశీర్వాదాలను అందిస్తుంటారు. స్వామి వారికి వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. కల్యాణ మహోత్సవాలను జరుపుతారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి కృష్నవేణమ్మ ఒడిలో సేద తీరి స్నానమాచరించి స్వామిని దర్శించి వారి ఆశీర్వాదాలని పొంది తరిస్తారు.

శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, మట్టపల్లి

పూర్వం భరద్వాజాది మహర్షులు శ్రీ నృసింహోపాసన చేసిన తపోభూమి మట్టపల్లి క్షేత్రం. ఆ కాలంలో మహర్షులు, దేవతలు మాత్రమే గుహా గర్భ మందలి స్వయం వ్యక్త శ్రీమూర్తిని సేవిస్తూండేవారు, కొంతకాలానికి లోక సంగ్రహ పరాయుణులైన ఋషులు, ఈ తీర్థమందలి భగవన్మూర్తిని మానవ సంతరణమునకు బహిరంగపరచ సంకల్పించారు. కలియుగంలో ఒక శుభ సమయంలో మట్టపల్లి కృష్ణానదికి ఆవలి తీరమున సమీపమందు గల తంగెడు జనపదమును పరిపాలిస్తున్న అనుముల మాచిరెడ్డి అనే భాగవత ప్రభువుకు స్వామి కలలో కనిపించి వత్సా! సమీప కృష్ణా తీరారణ్యములో ఒకానొక గృహగర్భంలో నా స్వయం వ్యక్తమూర్తి ముని సురబృంద అర్చనందుకుంటూ గుప్తంగా ఉన్నది. కలియుగ మానవ సంతరమునకు, ఇంక నా దివ్యమూర్తి సుప్రకటితం కావలిసి యున్నది. ఉదయమే నీవు వెళ్ళి గుహాగర్భగతమైయున్న నా స్వరూపమును సువ్యక్తపరిచి ధన్యుడవుగా అని ఆదేశించెను . మహాత్ముడైన మాచిరెడ్డి బ్రహ్మనందమయుడై లేచి, స్వప్నాదేశనుసారం, ప్రజలతో కూడి, మట్టపల్లి వనములో గుహలన్నీ అన్వేషించాడు. స్వామి శ్రీమూర్తి గోచరించలేదు చివరికి అతడు విచారంతో అడవిలో ఒక చోట నిద్రిస్తుండగా, కలలో తిరిగి స్వామి కుమారా! విచారపడకు, లేచి చూడు ఇక్కడే నీకోక అరచెట్టు, దానిపైన ఒక గరుడపక్షి కనబడుతుంది. ఆ చెట్టుకు సూటిగా అతి సమీపంలో ఒక గుహ ఉన్నది. ఆ గుహలో నా శ్రీమూర్తి యున్నది అని సెలవిచ్చాడు. మాచిరెడ్డి ప్రభువు దిగ్గున లేచి స్వప్నానుసారం గుహను గుర్తించి. ఆ గుహగర్భమున ఎదురుగా ఉన్న శిలా ఫలకమున శేషఫణిఢజామండలచ్ఛత్ర ముండితము, పద్మాసనాసీనము, శంఖచక్రగదా భయకరాబ్జమునై వెలయుచున్న శ్రీలక్ష్మీ నృసింహ భగవానుని స్వయం వ్యక్త దివ్యమంగళ మూర్తిని దర్శించి శ్రీపాద పీఠమున మునిదేవతా నికరములర్పించి, వేలిన చిహ్నములుగా వెలుగొందుచున్న ఫలపుష్పఫలాదుల గాంచి పరమానంద పరవశుడై స్వామిని ప్రకటించి, ముఖాలయాదులు నిర్మింపజేసి, తన జీవితమును శ్రీ నృసింహ పాదకైంకర్య యజ్ఞములో చరితార్థం చేసుకొన్నాడు. శ్రీ మాచిరెడ్డి అనంతరం శ్రీ చెన్నూరి గిరమ్మ గారు మొదలైన భక్తి స్వామి వారి కైంకర్య కార్యములందు ధన్యత గాంచారు. ఈ క్షేత్రము నందు భక్తి తత్పరులైన దాతలు, ధర్మ సంస్థలు మరియు ప్రభుత్వ తోడ్పాటుతో అనేక కట్టడ నిర్మాణములు కావింపబడుచు నిర్మించబడినవి.

రామగిరి

సూర్యాపేట నుండి 30 కి.మీ. దూరంలో ఉన్నది. కొండల నడుమ పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయము ప్రఖ్యాతి గాంచినది. ఈ ఆలయంలో శ్రీరామనవమినాడు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. గరుడ వాహనంలో స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఇంకా ధనుర్మాసం అంతా తిరుప్పావై చదువుతారు. ఈ మాసంలో జరిగే ఆండాళ్ కళ్యాణం చూడటానికి రెండు కనులు చాలవు.

పిల్లలమర్రి

ఈ గ్రామం సూర్యాపేట నుండి 5 కి.మీ. దూరంలో ఉన్నది. ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఇక్కడ ఆరాధ్యదైవం. స్వామి వారికి నిత్యం పూజలు సల్పుతారు. స్వామి వారి ఆలయం కాకతీయుల హయాంలో నిర్మితమైనదని, చరిత్రలో ఉంది. దానికి ప్రతీకగా ఆలయంపై ఆనాటి జన జీవనాలని ప్రతిఫలించే శాసనాలను చూడవచ్చు. ఆలయపు గోడలు చక్కటి డిజైన్లతో నిర్మితమై యున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఘనంగా వార్షికోత్సవాలు జరుగుతాయి.

భువనగిరి కోట

హైదరాబాద్ నుండి 51 కి.మీ. దూరంలో ఉన్నది. ఎత్తయిన కొండపై నిర్మితమైనది. ఈ కోట 40 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడి ఉన్నది. చాళుక్యవంశస్థుడైన త్రిభువనమల్లు విక్రమాదిత్యుడు ఈ కోట నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

గాజులబండ

సూర్యాపేట నుండి 40 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ ప్రాంతంలో బౌద్ధస్థూపాలను మనం చూడవచ్చు. నాగార్జున కొండ, అమరావతి ప్రాంతంలో ఉండే బౌద్ధ స్థూప అవశేషాలకు భిన్నమైన స్థూప అవశేషాలను మనం ఇక్కడ చూడవచ్చు. సున్నపురాయితో చేసిన రెండు సింహం బొమ్మలు ఇక్కడ ముఖ్య ఆకర్షణలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *