హైదరాబాద్ కి అరవై కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న కళానిలయమే కల్పగూర్. 10 , 11 శతాబ్దాలలో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువుల కళాదృష్టికి అద్దంపట్టే స్వయంభూలింగ దేవాలయం ఇక్కడ ఉంది. రామప్పగుడి, వేయి స్తంభాల మంటపం ప్రపంచానికి తెలిసినట్టుగా ఈ ఆలయం తెలియదు. ఇక్కడ కాశీ విశ్వేశ్వర, వేణుగోపాల, అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రతిష్టానంపై ఎనిమిది స్తంభాలతో నంది మంటపం ఉంది. ఇక్కడ నందీశ్వరుడు చక్కటి మువ్వల పట్టిక ధరించి ఉన్నాడు. రంగమంటపంలోనిది అపురూపమైన, అందమైన శిల్ప సంపద. వేణుగోపాలస్వామి ఆలయం కూడా అద్భుత శిల్పసముదాయమే. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఆవాహన చేయబడిన దేవీదేవతా శిల్ప మూర్తులు, కాశీ విశ్వేశ్వరాలయంలో నందీశ్వర సహితుడయిన విశ్వేశ్వరుడు కనుల పండుగ చేస్తారు. కాకతీయుల వాస్తు కౌశలమూ, శిల్పపరిజ్ఞానమూ నిక్షిప్తం చేసుకున్న కళానిలయం ఈ కల్పగురు త్రికూటాలయం.
శ్రీకృష్ణుని దేవాలయం
నెహ్రూ జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న బహదూర పూరాలోని శ్రీకృష్ణుని దేవాలయమే కిషన్‌బాగ్ దేవాలయం. ఇది హైదరాబాద్ లోని అతి పురాతన ఆలయాలలో ప్రధానమైంది. 150 సంత్సరాల క్రితం రాజా రఘురాం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటారు. నిజాంల పరిపాలనా కాలంలో వకీలుగా, దౌత్యవేత్తగా రాజా రఘురాం ఉండేవారు. ఆయన మనవడు రాయ్ మోహన్ లాల్ కిషన్ బాగ్ దేవాలయం నిర్వహణ బాధ్యత చేపట్టడంతో పాటు ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రథయాత్ర నిర్వహించేవారు. దేవాలయం చుట్టూ ఎత్తైన ప్రహరీగోడు ప్రాంగణంలో పెద్ద పూదోట, మంచినీటి బావి, అర్చకుల నివాసాలు ఉన్నాయి.
శ్రీ గణపతి దేవాలయం
భారతీయుల అనాది నుండి వైదిక పౌరాణిక మంత్రాల ద్వారా శ్రీ గణపతిని ఆరాధించి, పూజిస్తున్నారు. అట్టి పరమాత్మ అయిన గణపతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు ఒకటిన్నర శతాబ్దాల క్రితం అనేక కోటి సూర్య ప్రభలతో శ్రీ గణపతి దేవాలయమునందు ఆవిర్భవించి యున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీగణపతి దేవాలయమునందు వెలసిన విఘ్ననాయకుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతో నమ్మినవారికి శుభములు ప్రసాదిస్తున్నారు. 1824 సంవత్సర ప్రాంతంలో ప్రస్తుతం గణపతి దేవాలయం ఉన్న ప్రాంగంణంలో ఒక పాత దిగుడుబావిని బ్రిటీష్ సిపాయిలు ఇప్పుడు ఉంచబడిన ఆలయంలో ప్రతిష్టించడానికి పూనుకొన్నారు. బ్రిటీష్ అధికారులు అందుకు అభ్యంతరం తెలుపగా అధికారులకు స్వప్నంలో శ్రీవారు దర్శనమిచ్చి ఆలయ నిర్మాణమునకు ఎలాంటి అభ్యంతరములు తెలుపవద్దని ఆదేశించారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. ఈ దేవాలయం నందు 1932 సంవత్సరంలో శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ ఆదిత్యాది నవగ్రహాలు నిర్మింపబడి ఆయా దేవతా విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. 1968 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తమ అధీనములోకి ఈ దేవాలయమును తీసుకొన్నారు. నాటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. శ్రీ గణపతి ఆలయంలో వేంచేసియున్న శ్రీ గణపతి అత్యంత మహిమాన్వితులు. ఈ దేవాలయమునందు ప్రతినిత్యం సత్యగణపతి వ్రతం జరుగును . భక్తులు వారి కోరికలను అనుసరించి పూర్ణఫలం (కొబ్బరికాయ) మొక్కుబడిగా కట్టి మండలం (41) రోజులు, అర్థ మండలం (21) రోదీలు పూజాధికములు నిర్వహించి వారి వారి కోరికలు తీర్చుకొంటున్నారు. ప్రతి నెలా కృత్తికా నక్షత్రమున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి, శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారికి, దసరా సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వరి దేవికి నవరాత్రోత్సవములు జరుపుట ఇక్కడి సంప్రదాయం.
కలౌవేంకటనాయక
కలియుగంలో రామకృష్ణావతారములకు అతీతమై నారాయణ స్వరూపుడు, సకల భక్తజనుల పాలల ఎర్వేశ్వరుడు, సర్వాంగ సౌందర్యడు, అలివేలుమంగను అర్ధాంగిగా పొందిన ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు భాగ్యనగర నడిబొడ్డున వున్న చిక్కడపల్లిలో 1945 వ సంవత్సరములో ప్రతిష్టింపబడి భక్తుల పాలిట భవబంధ విముక్తుడై శ్రీనివాసపురంలో నిలిచారు అని ప్రతీతి. ఆనాటి నుండి ఈ వాటివరకు ఆనంఖ్యాకులైన భక్తులకు దర్శనమిస్తూ హర్షము చేకూరుస్తూ అరమరికలు లేకుండా ఇడిన వరములను కరుణిస్తూ ఆనంద నిలయములో స్థిర నివాసుడైనాడు. నగరం నడిబొడ్డున వున్నా అంతం. మధ్య అత్యంత సుందరంగా, మనోహరంగా అతి ప్రశాంతతో , దేవాలయంలో కాదనే భక్తిపూర్వకమైన వాతావరణాన్ని సూచిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన దినచర్యలో భాగంగా వుంచి హైదరాబాద్, చిక్కడపల్లి యందలి శ్రీనివాసపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామిదేవస్థానము. ఈ దేవస్థానములో కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహంతో పాటు ఇరు ప్రకలా అలివేలు మంగ అమ్మవారు మరియు సీతారామ లక్ష్మణ సహిత రామాలయం ఉన్నది దేవాలయ ప్రాంగణంలో హనుమంతుడు, నవగ్రహాలు, శివలింగము, విఘ్నేశ్వరుడు, పార్వతి అమ్మవార్లు మొదలగు విగ్రహాలు వున్నాయి.
శ్రీ జంగల్ విరోభ దేవాలయము
శ్రీ పాండురంగడు, దయా సముద్రుడు, భక్తుల పాలిట కల్పతరువు. ఆ పవిత్రమూర్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని ముచుకుంద పవిత్ర నదీతీరమున ఉస్మాన్‌షాపి ఈ దేవాలయమును కీ. శే. గున్నాజీ నాదస్వర వాదకుడు అనే భక్తుడు కట్టించెను. ఈ గున్నా పరమ పాండురంగని భక్తుడు. అతనే సర్వమని భక్తిభావముతో తన్మయత్వం చెందిన మనిషి, అతడు అందజేసిన ఈ భక్తి భావన మందిర ప్రాంతములో స్పష్టంగా కనబడుచున్నది. ఈ దేవాలయం పవిత్రమైనది, ఆయన లీలలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ దేవాలయమునకు సయ్యద్ హుస్సేన్ (విఠల్ నగర్) లో విలసిల్లినారు. బహదూర్ అనే ముస్లిం మందిర నిర్మాణమునకు భూమిని ఇచ్చెను. సయ్యద్ కి పురుష సంతానం లేకుండెను, ఈ విషయం శ్రీ గున్నాజీ మహరాజ్ కి విన్నవించెను. విఠలేశ్వరుని అనుగ్రహ కటాక్షము వలన సయ్యదకు పుత్రసంతానం కలిగెను . సయ్యద్ సంతోషంచేత విఠలేశ్వరుని ఆలయ నిర్మాణం కొరకు భూమిని ఇచ్చెను. ఈ దేవాలయం 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ అయినది. శ్రీ పాండురంగని దేవాలయము, ఆంజనేయస్వామి నవగ్రహ, శివపార్వతుల ప్రతిష్ఠ కూడా అదే సమయంలో జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలో రుక్మిణీ, పాండురంగని దర్శనం కొరకు శ్రీ మాణిక్య ప్రభు సంస్థాన పీఠాధిపతి సంత్ శ్రీ శ్రేష్ఠ మనోహర ప్రభువు లాంటి ఎందరో మహానుభావులు ఈ ఆలయమును దర్శించెను. 1908 వ సంవత్సరంలో ముచుకుందా నది ఉప్పొంగి భయంకర ప్రవాహంతో దేవాలయ స్థితిగతులను చిన్నాభిన్నం చేసింది. ఈ సమయమున అనేక వేల మంది దేవాలయము పైకి ఎక్కి తమ ప్రాణములను రక్షించుకున్నారు. తర్వాత 2003 సంవత్సరములో భక్తుల సహాయ సహాకారములతో ఆలయ పునః నిర్మాణం గావించబడినది. వేదశాస్త్ర సంపన్నులు, వంశపారంపర్య అర్చకులు అయిన గోవింద మహరాజ్ వారి ఆధ్వర్యంలో పూజా కారక్రమములు చేయుచున్నారు. విఠలేశ్వర బాల భక్త సమాజం ఏర్పాటు చేసి భక్తులు భజనలు, కీర్తనలు చేయుచున్నారు.
ఉత్సవాలు – పండుగలు
అషాడ శుద్ధ దశమి మొదలుకొని ఆషాడ బహుళ తదియ వరకు ఉత్సవములు జరుగును . ఆషాఢ ఏకాదశి రోజున రథోత్సవము జరుగును. కార్తీక మాసంలో హారతి కార్యక్రమంలో భాగంగా పౌర్ణిమ రోజున 108 సత్యనారాయణ వ్రతములు జరుగును. హనుమా జయంతి, మహాశివరాత్రి, దత్తజయంతి, శరన్నవరాత్రులు వైభవంగా జరుగును.
శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం, బల్కంపేట
దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లోని బల్కంపేట యందు శతకోటి ప్రభల తేజస్సుతో సర్వాభీష్ట ప్రదాయినియై భక్తుల ఆరాధ్య దేవిగా ఎల్లమ్మ వెలుగొందుచున్నది. భూమి ఉపరితలమునకు సుమారు పది అడుగుల దిగువన స్వయంభూమూర్తిగా వెలసియున్నది, అమ్మవారి మూల స్థానము నుండి స్వకాలము యందు ధారాళముగా పవిత్ర జలము ఆవిర్భవించుట ఇక్కడి విశిష్టత. ఈ దేవాలయము అతి ప్రాచీనమైనది, జలోద్భావస్థానము నందుండుట వలన శాస్త్రరీత్యా ఈమె జల దుర్గా దేవి. జనపదులు ఇట్టి పవిత్ర జలమును స్నాన, పానాదులకు ఉపయోగించుకొని ఆరోగ్యవంతులు అగుట నేటికినీ అనుభవమే, అందువలన ఈమె మహాదేవతేగాని గ్రామదేవత కాదు. అందువలననే శ్రీ కంచి పెద్దస్వామి వారిచే ఆరాధింపబడినది, మహాతప్సంపన్నులైన శ్రీ హంపి విరూపాక్ష శంకరాచార్య స్వాముల వారి పూజలనందుకొన్నది. ఎల్లరకు అమ్మయను నీమె ఎల్లమ్మగా నామాంతరము పొంది తరతమ భేదము లేక అందరిచేత కొలువబడు చున్నది. 1993 సంవత్సరం నుండి దేవాలయము సర్వతోముఖాభివృద్ధి చెందుతూ నూతనముగా అనేక పునర్నిర్మాణ కార్యక్రమములు చేపట్టడము జరిగింది. ఆ జగజ్జనని పాదపద్మములను నమ్మి సేవించినవారి పాపదుఃఖములను పటాపంచలు చేసి శాశ్వతమైన సుఖస్థానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. ఏడాది అంతా పూజింపనివారు దేవికి ఇష్టమైన వసంత నవరాత్రులు శరన్నవరాత్రులతో పూజించినవారు అభీష్ట ఫలాలను పొందగలరు. శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని దర్శించి పూజించిన వారికి సర్వశుభములను ప్రసాదించుచు అష్ట ఐశ్వర్యములను ఇచ్చి, సర్వపాపములను తొలగించి, సదా భక్తులను రక్షించుచున్నది.
శ్రీ పెద్దమ్మ దేవాలయము, జూబ్లీహిల్స్
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో వెలసిన శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించియున్న, సనాతన మైన అతి పురాతనమైన దేవాలయం. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయమున్నట్లుగా పూర్వీకులు చెబుతారు. ఈ దేవాలయమునకు భక్తులు జంటనగరాల నుండే కాక, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో ప్రతి ఆది, మంగళ, శుక్రవారములు ఆలయమునకు వచ్చి సంప్రదాయ సిద్ధంగా బోనములను శ్రీ పెద్దమ్మ తల్లికి సమర్పించి వారి మొక్కులను చెల్లించుట అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము కీ. శే. పి. జనార్ధన రెడ్డి (ఆలయ ఫౌండర్ ట్రస్టీ) గారి ఆధ్వర్యంలో జరిగింది. వీరి నేతృత్వంలో ఐదు అంతస్తుల గర్భగుడి, ఏడంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహములు, శ్రీ గణపతి, లక్ష్మీ, సరస్వతి దేవాలయాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆగమ శిల్పశాస్త్ర ప్రకారము కళా నైపుణ్యముతో నిర్మింపబడి, 1993 సంవత్సరములో ప్రారంభించబడినది.
చిత్రగుప్తుడి గుడి
ఉత్తర భారతదేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. దాదాపు 250 ఏళ్ల క్రితం చిత్రగుప్త దేవాలయాన్ని నిర్మించారు. నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ పర్షాద్ దీన్ని అభివృద్ధి చేశారు. కాయస్త్ సామాజిక వర్గానికి చెందిన రాజా కిషన్ పర్షాద్ రెండు సార్లు హైదరాబాద్ సంస్థానానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కిషన్ పర్షాద్ పూర్వీకులు ఈ దేవాలయ అంకురార్పణకు కృషి చేసినట్టు వినికిడి. వాస్తవానికి ఈ దేవాలయ నిర్మాత ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చినవారు దీన్ని నిర్మించారన్న ప్రచారం కూడా ఉంది. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ భూమి రోజు రోజుకి అన్యాక్రాంతమౌతుంది. ఇక్కడే శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం, అయ్యప్ప ఆలయం ఇలా నాలుగు ఆలయాలు చిత్రగుప్త దేవాలయంలో కొనసాగుతున్నాయి. కాబట్టి నాలుగు గుళ్ల దేవాలయంగా ఇటీవలి కాలంలో ఖ్యాతి పొందింది. చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య సూర్యదక్షిణ నందిని, ఈమె బ్రాహ్మణ స్త్రీ నలుగురు కొడుకులు. వారి పేర్లు, భాను, విభాను, విశ్వభాను, వీర్యబాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు, వారి పేర్లు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా . రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్, హిమవన్, చిత్ర చారు, అరుణ, జితేంద్రలు. కూతుళ్లు ఎనిమిది మంది . వారి పేర్లు భద్రకాళిని, భుజ్ గాక్షి, గడ్ కీ, పంకజాక్షి, కొకల్సూత్, సుఖ్ దేవి, కామకాల్, సౌభాగ్యానిలు ప్రస్తుతం ఈ ఆలయంలో చిత్రగుప్తుడు తన ఇద్దరు భార్యలతో కలిసి ఉన్న రాతి విగ్రహం కొలువుతీరింది.
వెలుగు గుట్ట భక్తుల కోర్కెలు తీర్చే దుర్గామాత
ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, జెన్ పాక్ సమీపంలో రెండు వందల సంవత్సరాల క్రితం గొర్రెల కాపరుల ద్వారా వెలుగు చూపిన వెలుగుగుట్ట పుణ్యక్షేత్రం నేడు ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రకృతి ఒడిలో సకల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దిన వెలుగు గుట్టపై వేకువ జామున తొలి సూర్య కిరణాలు పడడం వలననే వెలుగు గుట్టగా ప్రసిద్ధి చెందిందని (మల్లికార్జునుడు వెలసిన మల్లన్న గుట్టగా) పూర్వీకులు కథలుగా వెలుగు గుట్ట మహిమలను చెబుతుండేవారు. దీన్ని ఉర్దూలో రోషన్ పహాడ్ అని పిలుస్తారు . రెండు దశాబ్దాల క్రితం గొర్రెలను మేపడానికి వచ్చిన గొర్రెల కాపరులను కొండపై ఎత్తైన రాళ్ళ మధ్య గుహలో కనిపించిన శ్రీ మల్లికార్జున స్వామి వారిని గుర్తించి వారు పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత భ్రమరాంబ మల్లికార్జున స్వామిదేవాలయం, శ్రీ దుర్గామాత ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, నవగ్రహ మండపాలను కురుమ యాదవులు, భక్తులంతా కలిసి నిర్మించుకుని నేడు ఆధ్యాత్మికతకు మారు పేరుగా వెలుగుగుట్టను తీర్చిదిద్దారు. వెలుగుగుట్టపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, గణపతి సుబ్రహ్మణ్యస్వామి, నంది, నవగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి, విగ్రహ ప్రతిష్ఠలు అత్యంత వైభవంగా జరిగాయి. గుడి, గోపురం, మండపాలు విశాలముగా నిర్మించారు. నల్గొండ జిల్లాలో తయారు చేసిన 35 అడుగుల ఏకశిల రాతి ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. శ్రీ జగద్గురు శంకరాచార్యులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎందరో మహానుభావులు, ఋషులు తపస్సు చేసి దైవ దర్శనం పొందిన స్థలం అని, ఈ దేవాలయం నిర్మాణం అద్భుతంగా సాగుతుందని, భవిష్యత్తులో మహా పుణ్యక్షేత్రంగా వెలుగుతూ భక్తుల కోరికలు తీరుస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తోందని తెలిపారు.