వీరభద్ర స్వామి దేవాలయం

ఈ దేవాలయం క్రీ.శ. 14 వ శతాబ్దంనకు చెందినది. దీనిని చోళ రాజులు ప్రతిష్టించారు. శ్రీ మల్లయ్య ఆచార్యుల వారు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం, నందీశ్వర విగ్రహములు తయారు చేయించుకొని వేరే గ్రామంలో ప్రతిష్టించుటకు తీసుకువెళ్తూ దారిలో యవమదల గ్రామంలో ఉన్న మర్రిచెట్టు వద్ద విశ్రాంతి తీసుకొనదలచి, నిద్రకు ఉపక్రమించదలిచారు. అప్పుడు ఈ స్వామి వారు మల్లయ్యాచార్యులకు కలలో కనిపించి, ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్టించాలని, నేను ఇక్కడే ఉంటానని అని స్వామి చెప్పారు.

అప్పుడు మల్లయ్యాచార్యులు ఈ విగ్రహాలను ప్రతిష్టించటానికి నాకు ధనం, ధాన్యం లేవు స్వామీ అని చెప్పగా అప్పుడు స్వామి మల్లయ్యా! ఉదయాన్నే దున్నపోతులను నీళ్ళు త్రాగటానికి వదులు, నీకు ప్రత్యామ్నాయం చూపిస్తా అని చెప్పినారు. మల్లయ్యాచార్యులు ఉదయమునే దున్నపోతులను వదలగా అవి దగ్గరలో ఉన్న చెరువులో నీళ్ళు త్రాగి, స్నానం చేసి, బయటకు వచ్చేటపుడు లంకెబిందెలు తగిలించుకొని వచ్చాయి. ఆ ధనంతో మల్లయ్య ఆచార్యులు వారు యనమదలలో శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాన్ని, నందీశ్వరుడ్ని క్రీ.శ. 14 వ శతాబ్దంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత వచ్చిన రాజులు ఇక్కడ ముఖమండపాన్ని కట్టించి, వీరభద్రుని శాంతి కోసం అమ్మవారిని ప్రతిష్టించారు.

గుంటూరు నుండి యనమదలకు 11 కి.మీ. దూరం. గుంటూరు నుండి చిలకలూరి పేట వెళ్ళే (యన్. హెచ్ – 5) మార్గంలో ఈ దేవాలయం కలదు.

గుత్తికొండ

గుంటూరు నుండి 165 కి.మీ. దూరంలో కారంపూడికి దగ్గరలో ఉన్నది. ఇక్కడ ఉన్న అడవులలోని గుహలలో ఋషులు తపస్సు చేసారని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్థలములనే లక్షిణకాశి అని కూడా అంటారు.

శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం

ఈ దేవాలయం క్రీ.శ. 1286 సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తుంది. దీనిని కాకతీయ గణపతి దేవుని కుమార్తె గణపాంబిక నిర్మించినది. గణపాంబికను ధరణకోట పాలకుడు అయిన బేతరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన కొన్నాళ్ళకే బేతరాజు మరణించటంతో ఈమె పాలన చేసినది. భర్త పేరు మీద ఈమె అనేక దాన ధర్మాలు చేసినది . అంతేకాక ఎన్నో “విష్ణు” ఆలయాలను కట్టిస్తూ, యనమదల గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామిని ప్రతిష్టించి, అంగరంగ వైభవంగా స్వామి వారికి ఉత్సవాలు చేసినది. స్వామి వారి ధూప, దీప నైవేద్యాలకు అనేక పొలాలు, ఇతర అవసరమైన వసతులు అనగా బావులు, స్థలాలు పూల తోటలు మొదలైనవి ఏర్పాట్లు చేసినది.

కృష్ణాష్టమి, దసరా, ముక్కోటి, సంక్రాంతి, కళ్యాణోత్సవం మొదలైన ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ ఆలయంలో రాజుల శాసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నది. గుంటూరు నుండి యనమదలకు 11కి.మీ. దూరం. గుంటూరు నుండి చిలకలూరి పేట వెళ్ళే (యన్. హెచ్. – 5 ) మార్గంలో యనమదల ఉన్నది.

దుర్గి

గుంటూరు నుండి 135 కి.మీ. దూరంలో ఉన్నది. రాతిని చక్కటి శిల్పాలుగా మలచడం ఇక్కడ శిల్పుల ప్రత్యేకత, చీరు తయారు చేసిన శిల్పాలకు విదేశాలలో మంచి గిరాకీ ఉన్నది. వీరు పురాతనమైన పరిజ్ఞానంతో శిల్పాలను అద్భుతంగా మలచడమే కాక శిల్పాలకు సజీవకళను తెచ్చి, చూపరులను ఆకట్టుకుంటారు. వీరివద్ద సాంప్రదాయ పద్ధతులతో శిల్పకళను అభ్యసించవచ్చు. నాగార్జున కొండ పురావస్తుశాలలో వీరు మలచిన శిల్పాలను తిలకించవచ్చు.

కోటప్పకొండ దేవాలయం

కోటప్పకొండ దేవాలయంను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీనిని “త్రికుటాద్రి” అని పిలుస్తారు. ఇది అనాది కాలం నుండి తిరునాళ్ళకు ప్రసిద్ధి చెందింది. 1584 అడుగుల ఎత్తులో ఉన్న కోటప్ప కొండ శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. ఇక్కడ 687 అడుగుల ఎత్తున లింగ ఆకారంలో కోటేశ్వర నామంతో శివుని గుడి ఉంది. కొండపైకి ఎక్కే మార్గంలో బ్రహ్మ , సరస్వతి, అంజనేయ స్వామి, గరుడా పక్షి విగ్రహాలు ఉన్నాయి. మహశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. ఇక్కడ కార్తీక వనం అనే పార్క్ ఉంది. కార్తీక మాసంలో ఈ కార్తీక వనంలో వనసమారాధనలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడ కనిపించదు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల, అభిప్రాయం. ఇది నరసరావుపేటకి 12 కి.మీ. గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న బొచ్చు కోటయ్య గుడి దగ్గర భక్తులు మొక్కులు, తలనీలాలు సమర్పించుకుంటారు. ధ్వజ స్తంభానికి పిల్లలను కట్టి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. కొండపై నుండి దేవాలయాన్ని చేరుకోవటానికి 703 మెట్లు గల మెట్ల మార్గం కలదు. దీనిని క్రీ.శ. 1761 లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీ రాజామల్ రాజు గుండారాయుల గారిచే నిర్మించబడింది. మెట్ల దారి ప్రక్కనే ఉన్న గణపయ్యని దర్శనం చేసుకొని, భక్తులు చేరుకో కోటయ్య, చేరుకో అంటూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయంనకు చేరుకోవడానికి 4.5 కి.మీ. పొడవు గల ఘాట్ రోడ్ ఉన్నది. దీనిని 1998 – 2000 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఘాట్ రోడ్ మార్గం మధ్యలో అందమైన గార్డెన్స్, ఆక్వేరియం, పార్క్, కొలనులను నిర్మించి దీనిని పర్యాటక కేంద్రంగా మార్చారు. పాప వినాశనం తటాశనం గొప్పది. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కొండకు దక్షిణంగా ఓగేరు ప్రవహిస్తుంది. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో మోద దక్షిణా మూర్తి అయిన శివుడ్ని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నది. ఆలయం వెనుక భాగాన ఆలయ స్థలపురాణం తెలిపే మందిరం ఉంది. ఈ మందిరంపై రాతిపై చెక్కిన కోటప్పకొండ చరిత్ర ఉంది.

స్థల పురాణం…

దక్ష ప్రజాపతి యజ్ఞం చేయ దలిచి అందరినీ పిలిచాడు కాని పరమ శివుడ్ని పిలవలేదు. ఆ యజ్ఞానికి వెళ్ళడానికి పార్వతీ దేవి శివుడి అనుమతి కోరినది. పిలువని పేరంటానికి దేనికి? అని శివుడు చెప్పాడు. కాని పార్వతి దేవి వినలేదు. అప్పుడు ఆమెకు తోడుగా నందీశ్వరుర్ని పంపాడు. పిలవక పోయినా యజ్ఞానికి వచ్చిన పార్వతి దేవిని దక్షుడు అవమానించినా ఆమె తన కాలి బ్రొటన వేళ్ళతో అగ్నిని రగిల్చి ప్రాణ త్యాగం చేసింది. విషయం తెలిసిన శివుడు ఆగ్రహం… చెంది తన జటల నుండి వెంట్రుకలను పీకి నేలకు కొట్టగా దానిలో నుండి భద్రకాళి సమేతుడైన వీర భద్రుడు వచ్చెను. తన గణాలతో దక్ష యజ్ఞం ధ్వంసం చేసి, దేవతలను, మునులను అక్కడ నుండి పార ద్రోలి, దక్షుడి తల నరికాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు శివుడ్ని శాంతించమని కోరగా అప్పుడు శివుడు శాంతించి దక్షుడికి మేక తలను అతికించి బ్రతికించాడు. కాలిన పార్వతి దేవి శవాన్ని తీసుకొని శివుడు పిచ్చివాడిలా లోకాలన్ని తిరుగుతుండగా అది పరా శక్తి అనుమతితో విష్ణువు పార్వతి దేవి శవాన్ని ఖండ ఖండాలుగా నరకినాడు.

సతీ దేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చి వాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడ్ని ఆకర్షించి, ఆశ్రయమిచ్చి, ధ్యాన నిమగుడ్ని గావించిన శివారాధమే ఈ త్రికోటేశ్వరాలయం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనంద వల్లి అనే గొల్ల భామ పాలు, తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి యోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.

ఒకసారి గొల్ల భామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్ల భామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించెను. ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి అలాగే వస్తానని, నువ్వు యింటికి వెళ్లమని చెప్పారు. గొల్ల భామ గర్భవతై కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే క్రిందకు రా! అని శివుడ్ని వేడుకొనెను. ఆమె మొర విని శివుడు గొల్లభామతో ఆ క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు అని అనగా, సరే అంటూ ఆ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. స్వామి పది ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూచినది. అమ్మానే నేను ఆమె చూడగానే పరమ శివుడు లింగ రూపంగా మారాడు. ఆ గొల్లభామ శిల రూపంగా మారినది. ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిధ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఏసుదు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని చెప్పెను. అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయులు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేధ్యాలకు కొండ కావూరు అనే గ్రామాన్ని వ్రాసి యిచ్చాడు . ఇలా శిలా ఫలకాలపై అద్భుతమైన స్థల పురాణం చెప్పే మందిరమే ఈ స్థల పురాణ మందిరం. గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును, స్వామి వారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మ వారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కాని స్వామి వారు శాలంకయ్య కలలోకి వచ్చి సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పుట వలన అమ్మ వారి గుడి కట్టించలేదు.

సీతారామస్వామి దేవాలయం

ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇది పునర్నిర్మాణం చేయబడిన దేవాలయం. దీనికి రెండవ భద్రాద్రి అనే పేరు ఉన్నది. ఇక్కడ గాలి గోపురం 4 అంతస్తులను కలిగి ఉంది. ఇక్కడ రధం చూడదగినది రధచక్రం ఎత్తు సుమారు ఐదు అడుగులు. ఈ రామాలయం నిర్మాణం తర్వాత దేవస్థానానికి సంబంధించిన కోనేరు తవ్వుతుంటే ఆ కోనేరులో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం లభించింది. అప్పుడు స్వామి వారు ఒక భక్తుని వంటి మీదకు వచ్చి సీతా రామస్వామి దేవస్థానంలోనే నన్ను కూడా ప్రతిష్ఠించాలని చెప్పారు. ఆ ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామిని ఈ దేవాలయంలో ప్రతిష్టించినట్లుగా తెలుస్తుంది. గుంటూరు నుండి యనమదలకు 11 కి.మీ. దూరం. గుంటూరు నుండి చిలకలూరి పేట వెళ్ళే (యన్. హెచ్. – 5) మార్గంలో యనమదల ఉన్నది

జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం

జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం చాలా పురాతనమైంది. ఈ గుడి గుంటూరు జిల్లా, సంగం జాగర్లమూడిలో ఉంది. సంగమేశ్వర దేవాలయం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది. ఈ చారిత్రక దేవాలయం విశిష్టంగా ఉంటుంది, ఒక పక్కన ప్రాచీనతను ప్రతిబింబిస్తూ మరో పక్కన అపురూపమైన శాంతి నిలయంలో ప్రవేశించిన భావనను మనసులో నింపుతుంది. ఆలయ ప్రాంగణంలో నుండి దేవాలయంలోకి దారి తీస్తే, ముందుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. తూర్పు ముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా, కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు. గుడి ప్రాంగణంలో తూర్పుదిక్కున ప్రాకారానికి దగ్గర్లో పెద్ద సత్రం, ఆఫీసు ఉన్నాయి. ఉత్తర దిక్కున నాగ ప్రతిమలు, కాలభైరవుని విగ్రహం, యజ్ఞశాల ఉన్నాయి. దక్షిణ దిక్కులో కళ్యాణ మండపం, వీరభద్రేశ్వరాలయం, పార్వతీదేవి ఆలయం, పాప వినాశాకేశ్వరాలయం, నవగ్రహాలు కనిపిస్తాయి. ఇంకా ఈ గుడిలో అనేక చెట్లు, పాకశాల మొదలైనవి ఉన్నాయి.

దాదాపు మన ప్రాచీన దేవాలయాలన్నీ దేవుడు ఆ ప్రాంతీయులు ఎవరి కలలోనయినా కనిపించి ఫలానా ప్రదేశంలో తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పి కట్టించుకున్నవే. కొన్ని మాత్రం పూర్వం మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమిలో కట్టినవి. గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట. తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట. అత్రి మహాముని కట్టించిన దేవాలయం శిథిలావస్థకు చేరగా, 17 వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *