ప్రకృతిలో మనకు అనేక విచిత్రాలు కనిపిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి. అక్కమహాదేవి గుహా. మన రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీగిరి పర్వతాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడికి చేరాలంటే పడవ ప్రయాణం తప్పదు. శ్రీశైలం డ్యాం వద్ద నుండి 12 కి.మీ.ల దూరం కృష్ణానదిలో పడవ ప్రయాణం చేస్తే ఆక్కమహాదేవి గుహకు చేరతాము. ఈ ప్రాంతంలో ఇటువంటి గుహలు చాలా కనిపిస్తాయి. అయితే వీటిలో అక్కమహాదేవి గుహ ప్రసిద్ధి చెందింది.

అక్కమహాదేవి 12 వ శతాబ్దానికి చెందిన మహా శివభక్తురాలు. ఈమె గొప్ప మానవతావాది. వేమనను తలపించే యోగినిగా ప్రసిద్ది చెందింది. అనేక సంవత్సరాలు అక్కమహాదేవి ఈ కీకారణ్యంలోనే నివసించి, తన మనోహరుడైన మల్లికార్జునస్వామిని ఆరాధించి, అనంతరం ఇక్కడికి సమీపాన ఉన్న కదళీవన ప్రాంతంలో దైవంలో ఐక్యమైందని గాథలు ఉన్నాయి. ఇంతటి సుందరప్రదేశాన్ని చేరాలంటే జలమార్గం తప్పనిసరి అయినా, మనోఉల్లాసాన్ని కలిగించే ఈ మనోహర దృశ్యకావ్యాన్ని వీక్షించడానికి పర్యాటకులు పరితపిస్తుంటారు. ప్రకృతి చెక్కిన ఈ శిల్ప సౌందర్యాన్ని తిలకించి అలౌకికానందాన్ని పొందుతుంటారు.

ఇక్కడి బండలపై నడుచుకుంటూ వెళ్ళితే దట్టమైన లతలతో నిండిన గుహ కనిపిస్తుంది. ఈ గుహలకు పర్యాటకులు సమూహంగానే వెళతారు. మరపురాని మధురాను భూతిని మిగిల్చే అక్కమహాదేవి గుహముందరి భాగంలోని స్తంభాకార శిలలు చూస్తే, విశ్వకర్మ లాంటి దివ్యకళాకారుడెవరో వాటిని అసంపూర్తిగా చెక్కి వదిలేశాడా అన్న చందాన కనిపిస్తాయి. నేడు కాస్తో కూస్తో ప్రయాణ సౌకర్యాలు ఉండటం వల్ల, అక్కమహాదేవి గుహకు చేరగలుగుతున్నాము. ప్రయాణవసతి కూడా లేని దట్టమైన కీకారణ్యంలోకి అక్కమహాదేవి వచ్చి ఎలా నివసించ గలిగిందో… అంతు చిక్కని విషయం. పైపెచ్చు ఒక మహిళ, క్రూరమృగాలు సంచరించే ఈ కీకారణ్యంలో ఎలా ఉండగలిగిందనే ప్రశ్నా ప్రతి సందర్శకుని లోనూ తలెత్తక మానదు

అక్కమహాదేవి గుహాంతర్భాగంలో, ఆమె తన పతిగా భావించి ఆరాధించిన శివలింగం ఉంది. గుహ ముందు విశాలమైన హాలులో పోచమ్మ, మారమ్మల విగ్రహాలు కనిపిస్తాయి. అక్కమహాదేవి, కర్ణాటక ప్రాంతానికి చెందినదిని తెలుస్తుంది. అప్పట్లో ఈమె నివసించిన ప్రాంతానికి కర్ణాటక అని పేరు ఏర్పడలేదు. శివమొగ్గ అనే జిల్లాలో శివభక్తులైన పుణ్యదంపతులకు అక్కమహాదేవి జన్మించింది. ఈమె అత్యంత సౌందర్యరాశి అని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈమెను చిన్నతనంలో మహాదేవి అని పిలిచేవారు. బాల్యం నుండే తోటి స్నేహితురాళ్ళతో కలిసి గౌరీపూజు చేసింది. సమయంలో భర్త పేరు చెప్పమని తమాషాగా ఎవరో అంటే, ఏం చెప్పాలో తెలియక, అమాయకంగా తల్లివైపు చూసేదట. మల్లికార్జునుడే తన భర్త అని చెప్పమని తల్లి సమర్ధించేదట. అంతే! నాటి నుండి ఆ బాలిక అలాగే చెప్పింది. బాల్యంలో నాటుకున్న ఆ బీజాలు, యుక్తవయస్సు వచ్చాక కూడా ఆమెలో సుస్థిరంగా నాటుకుపోయాయి.

మహాదేవి సౌందర్యానికి ముగ్ధుడైన కౌశికుడనే రాజు. ఆమెను వివాహం చేసుకొంటానని కోరాడు. శైవులైన అల్లుడుగా అంగీకరించ లేదు. దాంతో, బలవంతంగా మహాదేవిని తన అంతః పురానికి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశాడు. తన వివాహవిషయమై తన వాళ్లకు ఎటువంటి సమస్యలూ రాకూడదని, మూడు షరతులు విధించి మహాదేవి వివాహానికి అంగీకరిస్తుంది. తాను చేస్తున్న శివారాధనలు, దానధర్మాలకు రాజు అడ్డు చెప్పరాదు. రాజు శైవమతాన్ని తీసుకుని శివలింగారాధన చేయాలి. ఇవి రెండు షరుతులు కాగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇల్లు వదలి వెళ్లిపోతాననేది మూడో షరతు

వివాహనంతరం కూడా మహాదేవి విరాగినిలా శివధ్యానంలోనే లీనమైవుండేది. విసుగెత్తిన రాజు ఆమెను బలత్కరించబోయాడు. “ఆ అస్థిపంజరంపై మోహమెందుకు?” అని బోధ చేసి రాజుకు జ్ఞానోదయం కలిగించింది. ఆ మీదట, మహాదేవి సంపూర్ణ విరాగినిగా మారిపోయి, మల్లికార్జుని వెతుకుతూ శ్రీశైలం వైపు బయలుదేరింది.

పత్తికొండ

కర్నూలు నుండి 90 కి.మీ. దూరంలో ఉన్నది ఈ ప్రాంతం. శ్రీషిర్డిసాయిబాబా ఆలయం ఉన్నది. ఎల్లప్పుడు ఈ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ భక్తులను కనువిందు చేస్తుంటాయి.

కాల్వ బుగ్గ

కర్నూలు నుండి 33 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ కాల్వబుగ్గలోనే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. పేరు ప్రఖ్యాతలున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం అత్యంత శ్రేష్ఠం. ఇక్కడ నీటి బుగ్గ కోనేరులో ప్రతీవారు స్నానమాచరించవలసిందే.

బేతంచెర్ల

కర్నూలు నుండి బస్సు సౌకర్యం గలదు. బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామానికి సమీపంలో అందమైన కొండల నడుమ ఉన్నది. ఆ ఆలయంలోని స్వామి శ్రీలక్ష్మీ గణమద్దిలేటి స్వామి. ఈ స్వామితో పాటు చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఆస్వాదించి మనస్సుకు నిశ్చింత చేసుకొనవచ్చు.

శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామి దేవస్థానం

క్రీస్తు పూర్వము నందున హరిహర చక్రవర్తుల హరిహర బుక్కరాయలుచే శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ గావింపబడినది. ఈ దేవాలయమును 1998 లో మూలసాగరం గ్రామంలో పునః ప్రతిష్ఠ జరిపారు. ప్రతి సంవత్సరం దసరా, సంక్రాంతి, ఉగాది, శ్రీ హనుమజ్జయంతి, శ్రీరామనవమి పర్వదినములు మరియు బ్రహ్మోత హ్మోత్సవములు, ప్రత్యేక అభిషేక, అర్చనలు, ఆకుపూజలు, కుంకుమార్చనలు శ్రీ చెన్నకేశవ ఆంజనేయస్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా జరుపబడును.

వీరభద్రక్షేత్రం కైరుప్పల

కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం పరిధిలో ప్రఖ్యాతమైన వీరభద్రక్షేత్రం వైరుప్పుల, ఇక్కడ అమ్మవారిని కాళమ్మ (భద్రణాళిగా) కొలుస్తారు భక్తులు. ఏటా వీరభద్రుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ నిర్వహించే ముగ్గులాట ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఆ కథేంటంటే… కృతయుగంలో భద్రకాళి అమ్మవారు వీరభద్రుణ్ని వివాహం చేసుకోమని అడగ్గా చేసుకోనని ఆ స్వామి ఆటపట్టింంచారట. దాంతో ఉక్రోషం పట్టలేకపోయిందట అమ్మవారు. మర్నాడు వీరభద్రుడు వ్యాహ్యా వచ్చే సమయానికి పిడికలు తయారుచేసి తన అనుచరులతో సహా సిద్ధంగా ఉంది. ఆ స్వామి పై పిడకలు వేయించిందట. ఆనాటి పిడకల సమరానికి గుర్తుగా నేటికీ భక్తులు ముగ్గులాట పేరుతో వేడుక నిర్వహిస్తారు గ్రామస్థులే అమ్మవారి పేరిట కొందరూ వీరభద్రుడి వర్గంగా మరికొందరూ విడిపోతారు. ఒకరి పై ఒకరు పిడకల్ని విసురుకుంటారు. దాదాపు గంటపాటు జరిగే ఈ వినోదాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడినుంచో తరలివస్తారు భక్తులు.

ఆళ్ళగడ్డ

కర్నూలు నుండి 120 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ ఊరులోని ప్రత్యేకత శిల్పకళా మందిరం, అనేక మంది శిల్పుల చాతుర్యానికి ప్రతీక ఆ మందిరం. కర్నూలు పుణ్యక్షేత్రాలను దర్శించే యాత్రీకులు ఆ శిల్పకళా మందిరాన్ని దర్శించి తీరవలసినదే. మనస్సునకు ఆహ్లాదాన్ని కల్పించే ఈ మందిరం చిత్రకారులకు, కళాకారులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఆహ్లాదాన్ని అందిస్తోంది.

ఆత్మకూరు

నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఊరి నుండి దాదాపు 18 కి.మీ. దూరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయం శ్రీ కొలను భారతీదేవి ఆలయం. సరస్వతీదేవి కొలువు తీరిన ఈ ఆలయానికి భక్తులు తమ పిల్లకు అక్షరాభ్యాసాన్ని చేస్తారు. ఇక్కడ అక్షరాలు దిద్దించిన పిల్లలకు మంచి భావిష్యత్తు కలుగుతుందని అమ్మవారు దీవెన వారిపై ఎల్లప్పుడు ప్రసరితమవుతుందని భక్తుల నమ్మకం. కర్నూలు నుండి బస్సు సౌకర్యం కలదు.

నందికొట్కూర్

కర్నూలు నుండి 33 కి.మీ. దూరంలో ఉండే ఈ నందికొట్కూర్ శ్రీ సూర్యదేవాలయమునకు ప్రసిద్ధి చుట్టూ చక్కటి ప్రకృతిలో అలరారుతూ మనస్సులను పులకరింపచేస్తూంటుంది. శ్రీ సూర్య భగవానుని భక్తులు మనసారా ప్రార్ధించి స్వామి కృపను పొందుతారు. కర్నూలు నుండి బస్సు సౌకర్యం కలవు.

గద్వాల్

కర్నూలు నుండి 60 కి.మీ. దూరంలో ఉండే ఈ గద్వాల్ చేనేత మరియు నూలు చీరలకు అత్యంత ప్రసిద్ధి చెందినది. రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఆడవారి మనస్సును దోచే చీరలు గద్వాల్ చీరెలు. తేలికపాటి బరువుతో, చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ చీరలను కోరని మగువ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ ఊరి చెన్నకేశవ ఆలయంలోని చెన్నకేశవస్వామిని దర్శించి తీరవలసినదే.

పెద్దమ్మతల్లి (గోస్పాడు )

నంద్యాలకు దగ్గరగా వున్న ఈ మందిరం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని 300 ఏళ్ళ క్రితం నిర్మించారు. 1999 లో ఈ ఆలయాన్ని పునర్నిమించి హంపీ శంకరాచార్య వారిచే కుంభాభిషేకాన్ని నిర్వర్తింపజేసారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాన్ని జరుపుతారిక్కడ, ఇక్కడ బ్రహ్మోత్సవం సందర్భంలో ఎద్దుల పందాల్ని నిర్వహిస్తూ వుంటారు. నంద్యాల బస్టాప్ నుంచి కోయిలకుంట్లకి వెళ్ళే బస్సుల్లో ‘గోస్పాడు’ బస్టాపులో దిగి యాలూరుకు వెళ్ళే బస్సుకి మారాలి. ఆ మార్గమధ్యంలో వుందీ పెద్దమ్మ తల్లి మందిరం.

చౌడేశ్వరి ఆలయం, నందవరం

కర్నూలు జిల్లాలోని నందవరం గ్రామంలో ఉందీ దేవి ఆలయం. ఈ ఆలయాన్ని గ్రామదేవత ఆలయంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాన్ని చాలా విశాలంగా ఉండేలా పెద్ద ఎత్తుగా నిర్మించారు. ఆలయ రాజగోపురం ఊరిలో నుండి ఎక్కడ నుండి చూసినా కనిపిస్తుంది. ఈ అమ్మవారు పార్వతీదేవి రూపాన్ని ధరించి విచ్చేసిందన్న కథనంతో స్థలపురాణం వివరిస్తోంది. అమ్మవారు కోరిందల్లా ఇచ్చే తల్లిలా భక్తులకి నమ్మకాన్ని ధారపోసింది. అందుకే ఆమె దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఈ నందవరం గ్రామానికి చేరుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడో పెద్ద జాతర నిర్వహించబడుతుంది. నిత్యార్చనలు భక్తుల్ని బాగా ఆకట్టుకుంటాయి. పానెం రైల్వే స్టేషన్ నుండి ఈ నందవరం 8 కి.మీ. దూరంలో ఉంది. కర్నూలు నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం కలదు.

లింగమేశ్వరం

కర్నూలుకు 56 కి.మీ. దూరంలో ఉన్న క్షేత్రం సప్తనది సంగమం అని పేరు. తుంగభద్ర, భీమరాతి, వేణి, మూలాసహరిణి అనే నదులు కృష్ణానదిలో కలుస్తాయి. ఇక్కడ కృష్ణలో భావవాసి కలుస్తుంది. దీనిని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. స్వామి సంగమేశ్వరుడు దీనిని ధర్మరాజు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. చాళుక్యుల శాసనాలు కూడా వున్నాయి.

సింగోటం స్వామి

కొల్హాపూర్ నియోజకవర్గంలోని అతి ప్రాచీన దేవాలయాలలో సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయమొకటి. కోల్హాపూర్ కు పది కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయంలో ప్రతి సంక్రాంతి పర్వదినం అనంతరం నెలరోజులపాటు తిరునాళ్ళు జరుగుతుంది.

ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. ఆలయం ప్రక్కనేగల గుండంలో భక్తులంతా కట్టుకున్న వస్త్రాలతోనూ తలస్నానాలు చేసి, అలాగే వెళ్ళి పూజలు జరిపిస్తారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం తరువాత ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. లింగాకారంలో గల ఈ స్వామికి ప్రతి సోమ, శనివారాలలో పూజలు నిర్వహిస్తారు.

జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి తిరునాళ్ళకు బస్సు సౌకర్యం ఉంటుంది. దాదాపు 900 ఏళ్ళ క్రితం సురభి వంశస్థుడైన 11 వ తరానికి చెందిన సింగమనాయుడి కాలంలో ఈ ఆలయం ఏర్పడింది. దీని వెనుక కథ ఉంది సింగోటం గ్రామంలోని ఒక పేద రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి శిల అడ్డుతగిలింది. దాని తొలగించి గట్టుపై ఉంచాడు ఆ రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టునుండి మాయమై మళ్ళీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు. అనంతరం శిలారూపంలో వున్న శ్రీ నృసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి, ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా ఆయన గుర్తించలేదని అందువల్ల నీవు వెళ్ళి సూర్యోదయానికి ముందే లింగాకారాన్ని తొలగించి పవిత్ర స్థలంలో ప్రతిష్టించమని ఆదేశించాడట. నిద్ర మేల్కొని వెంటనే ఆ లింగాన్ని ప్రతిష్టించాలడని ప్రతీతి. నాటి నుండి పూజలు జరుగుతూనే వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *