కారంపూడి చెన్నకేశవాలయం

కారంపూడి చెన్న కేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం. చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే ఈ గుడిని గురించి విశేషంగా చెప్పుకుంటారు.

కారంపూడి వీరత్వానికి పెట్టింది పేరు. అందుకు తగ్గట్టుగానే, ఈ గుడిలో వీరావేశాన్ని పెంచి పోషించే ఆయుధాలు ఉన్నాయి. చెన్నకేశవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలయం, మండపం మూడు భాగాలుగా ఉంటుంది. మండపంలో చెన్నకేశవుని వాహనం గరుత్మంతుడు, బ్రహ్మనాయుడి ఆయుధం కోతతం, బాలచంద్రుడి ఆయుధం సామంతం, కన్నమదాసు ఆయుధం భైరవ ఖడ్గం ఉంటాయి. ఇక గర్భగుడిలో చెన్నకేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ చెన్నకేశవాలయం గుంటూరు జిల్లా పల్నాటి సీమ, కారంపూడి గ్రామంలో ఉంది, బ్రహ్మనాయుడి పేరు చెప్పగానే చాపకూడు గుర్తొస్తుంది. కులాల వ్యత్యాసం విపరీతంగా ఉండి, నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్న రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. అన్ని కులాల వారినీ ఒక దగ్గరగా కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టించాడు. కౌరవ, పాండవుల మహాభారత యుద్ధం మాదిరిగానే పల్నాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య చెలరేగింది. అంతులేని కల్లోలాన్ని కలిగించి, అశాంతికి దారితీసిన పల్నాటి యుద్ధం ఈ కారంపూడిలోనే జరిగింది. ఆ యుద్ధ చిహ్నాలు ఆలయంలో కనిపిస్తాయి. చెన్నకేశవ స్వామినే కాకుండా ఈ ఆయుధాలను కూడా ఇక్కడ పూజిస్తారు.

మంగళగిరి గంగాభ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయం

గంగా భ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయం అతి ప్రాచీనమైన దేవాలయం. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. అంతరాయంలో మల్లేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన పార్వతీదేవి, బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులను సంతుష్టులను చేస్తారు. ఇక్కడ ముగ్ధమోహనం గావించే ఆంజనేయ స్వామి, బాల గణపతి ప్రతిమలు కూడా ఉన్నాయి. భ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయంలో నవగ్రహాలను ప్రతిష్ఠించారు.

మంగళగిరి భ్రమరాంబికా సమేత మల్లేశ్వరాలయంలో భక్తులు నిత్యం అర్చనలు, హారతులు చేయించుకుంటారు. ఇక్కడ ఆరుద్ర నక్షత్ర పూజ ప్రత్యేకంగా చేస్తారు. ఇక విశేష పర్వదినాల్లో ఆయా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు, మహా శివరాత్రి వేడుకలు, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

సీతానగరం

గుంటూరు నుండి 30 కి.మీ. విజయవాడ నుండి 5 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ సోమేశ్వరస్వామి ఆలయం పురాతనమైనది, దర్శించదగినది. కృష్ణానదిలో విహరించటానికి ఎ.పి.టూరిజం వారు నిర్వహిస్తున్న బోట్ క్లబ్ ఉన్నది.

కాకానిలో కొలువైన మల్లన్న

భారతదేశంలో సుప్రసిద్ధంగా వెలుగొందుతున్న అనేక శైవక్షేత్రాలలో గుంటూరునకు 7 కి.మీ.ల దూరంలో గల పెదకాకాని గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి. పురాణ ఇతిహాసాలతో పాటు చరిత్ర కూడా కలిగి భక్తుల పాలిట కల్పతరువై పుణ్యక్షేత్రమై విరాజిల్లుతున్నది. ఈ మహాపుణ్యక్షేత్రంలో శ్రీ గంగా క్రమరాంబసమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారు కొలువుదీరారు. అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాన్ని గురించిన ఇతిహాస సంఘటనలకు సంబంధించిన ప్రాచీన గాధలు కలవు. ఇంద్రకీలాద్రికి మరియును గర్తపురికిని మధ్యనగల యొక సుందరవనమునందు సిద్ధయోగియైన ఒక మహాభక్తుడు పరమేశ్వరుని కొరకు యుగముల తరబడి తపస్సు చేయుచుండెను. ప్రస్తుతం ఈ ప్రదేశమే కాకాని పుణ్యక్షేత్రమని పిలువబడుతున్నది. ఆ సిద్ధయోగి తపస్సుకు మెచ్చి వరములీయదలంచి పరమశివుడు ప్రత్యక్షమై యీ భక్తాగ్రేసురుని వరము కోరుకోమన్నాడు. పరమ శివ భక్తుడు సదాశివుని సదా ఆ క్షేత్రమునందు శివలింగ రూపములో వెలసి భక్తుల పాలిట కల్పవృక్షమై వెలుగొందవలయునదిగా కోరాడు. దానితో పరమేశ్వరుడు కాకాని క్షేత్రమున స్వయంభువుగా వెలిశాడు. శ్రీ శైల క్షేత్రంలో వెలసియున్న అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబదేవి, ద్వాదశ జ్యోతిర్లింగములో ఒకరైన శ్రీ మల్లిఖార్జున స్వామి వారు ప్రధానాంశాలైనందున ఈ క్షేత్రదర్శనం చేసిన వారికి శ్రీశైల క్షేత్రం దర్శనం చేసినందువల్ల కలిగే ప్రయోజనం సిద్ధిస్తుంది. దీనికి తార్కాణంగా శ్రీశైల స్థలపురాణము అనుబంధమునందలి అంగక్షేత్ర సంక్షిప్త చరిత్ర లో శ్రీ మల్లిఖార్జున దేవుని అంశావతారములు, మల్లిఖార్జున దేవుని శ్రీశైల సమాగమము పంచమ ప్రకరణంలో కాకాని ప్రశస్తిని గూర్చి వివరించబడింది. శ్రీ భరద్వాజ మహాముని ఒకప్పుడు సర్వతీర్థంబులు సేవిస్తూ, భూప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఒకనాడు ఈ కాకాని మహాక్షేత్రమునకు వచ్చాడు. ఇచ్చట ఉన్న శివలింగమును చూచి మహిమాన్వితమైనదిగా గుర్తించి మహేశ్వరుని ఆరాధించాడు. ఆ మహర్షికి శివానుగ్రహము వలన ఒక యజ్ఞము చేయాలని సంకల్పము కలిగినది. వెంటనే ఆయన యజ్ఞమునకు కావలసిన వాటిని సమకూర్చుకొని, మహర్షి పుంగవులెందరినో ఆహ్వానించింది. యజ్ఞశాలను, నిర్మింపజేసినారు. వేదికలను ఏర్పాటుచేసారు. ఒక సుముహూర్తమున యజ్ఞసంకల్పము జేసి, సర్వాలంకృతమైన యజ్ఞశాలలో యజ్ఞమును ప్రారంభించి, అగ్ని ప్రజ్వలనం చేసి దేవతలకు యజ్ఞహుతులనిస్తున్న సమయంలో అక్కడి కొక కాకివచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినటం మొదలు పెట్టింది.

యజ్ఞం అపవిత్రమైపోతున్నదన్న ఆవేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారింపబోయినాడు. అప్పుడు కాకి మనుష్య భాషలో ఈ విధంగా చెప్పింది. ఓ మహర్షీ నేను కాకాసురుడనే రాక్షసుడను. సకల సృష్టికర్తయగు బ్రహ్మను గూర్చి మహాతపస్సు చేసి ఆయనను మెప్పించి ఒక వరాన్ని పొందాను. దాని వల్ల దేవత కిచ్చేటటువంటి హసిర్భాగాలనన్నిటినీ నేను భక్షించవచ్చు. బ్రహ్మవరం పొంది, హవిస్సులను తింటున్న నన్ను వారించుచుంటివి.నీవు తలపెట్టిన యజ్ఞమును నిర్విఘ్నముగా పూర్తిచేసికొనుట వలన నాకు శాపవిమోచనం అయ్యే తరుణం ఆసన్నమయినది. సమస్త నదీ జలములతో ఈ మల్లేశ్వర స్వామి వారిని అభిషేకించి జలం నామీద సంప్రోక్షణ చేసిన నాకు శాపవిమోచనం కల్గును అని ఆ కాకి చెప్పింది.

యజ్ఞం పూర్తయిన పిమ్మట శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారికి సమస్త నదుల తీర్ధములన్నింటిని సేకరించి శ్రీస్వామివారికి అభిషేకమొనర్చి మిగిలిన ఆ జలం కాకిమీద చల్లగా వెంటనే ఆ కాకి నల్లని రూపమును వీడి తెల్లని వర్ణము పొంది మానస సరోవరమునకు పోయెను. ఈ భరద్వాజ మహాముని ఇట్టి మహిమానిత్వమైన శివలింగమును మల్లె పుష్పములతో పూజించాడు అందువలన ఇక్కడి ఈశ్వరునికి మల్లేశ్వరుడుగా పేరు వచ్చింది. మరియును పుణ్యక్షేత్రానికి కాకాని అని పేరు వచ్చింది. ఆ పక్షిరాజు మానస సరోవరమునుండి ఆకాశ మార్గమున దక్షిణ భారతములో తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద గల పక్షితీర్థానికి వెళ్ళి అక్కడ గల సర్వేశ్వరుని సేవించి అచట వైభవమును దర్శించి బలిని స్వీకరించి తిరిగిపోతూ వుంటుంది.

ఈ విధంగా తిరిగి వచ్చేటప్పుడు ఈ కాకాని మల్లేశ్వరస్వామిని దర్శిస్తూ వుంటుందని పురాణములో చెప్పడం జరిగింది. దేవాలయ తూర్పుభాగాన భరద్వాజ మునిచే నిర్మించిన భావి ఒకటి కలదు. మహర్షి పుంగవులు సమస్తతీర్థాల నుండి పవిత్ర జలాన్ని సేకరించి ఈ బావిలో వుంచారు. భరద్వాజముని యజ్ఞద్రవ్యాన్ని ఈ బావిలో వదలినందున దీనికి యజ్ఞాలబావి అని పేరు వచ్చినట్లుగా చెప్పుదురు.

మరియొక కథ కలదు, కైలాసవాసియైన సాంబశివుడు పార్వతీ సమేతంబుగా ఆకాశమున విహరిస్తూ భూస్థలమునందుగల కాకాని గాంచి తొలుత మహాభక్తుడైన కాకాసురుడు గోమయ లింగంబును ప్రతిష్టించి, పూజించి తపస్సు చేసి తరించిన చోటుగా గ్రహించి, నా చోటు నాకర్షించి ప్రజలను రక్షించుటకై మల్లేశ్వర నామంబున ఆలింగము నందావిర్భూతమై యున్నట్లుగా వివరించబడియున్నది. కాకాసుర వధానంతరం శ్రీ రామచంద్రుడా లింగమునకు కోటి పత్రి పూజ చేశాడంట… విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయల ఆజ్ఞమేరకు కాకానిలో శివాలయాన్ని పునర్నిర్మించి శివలింగ పునఃప్రతిష్ట చేశారు.

శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం

పూర్వం ఈ ప్రాంతమంతా అడవిగా వుండేది. పాదర్తి వెంకన్నగారి స్వప్నంలో శ్రీస్వామివారు కనిపించి ఇక్కడ ఆలయము నిర్మించమని చెప్పారు. ఆధ్యాత్మికతను, హనుమాన్ భక్తిని పెంపొందించవలెనని ఆదేశించారు. గుంటూరు పట్టణములో ఆర్యవైశ్య ప్రముఖులైన శ్రీపాదర్తి వెంకన్నగారు శ్రీ స్వామివారి ఆదేశానుసారం 1896 సంవత్సరంలో రైలు పేటలో ఈ ఆలయమును నిర్మించి, అందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని, శ్రీరామలక్ష్మణ సహిత సీతాదేవి అమ్మవార్లను ప్రతిష్ఠించారు. నాటి నుండి యాత్రికులు శ్రీస్వామివారి ఆలయమునకు ఎదురుగా ఉన్న సత్రం నందు బస చేసి, శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవారు. ఇక్కడ ప్రతిష్టించబడిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు సకల జనుల అభీష్టాన్ని తీర్చే దైవంగా, పిలిచిన పలికే వేల్పుగా ప్రీతిపాత్రుడై యున్నారు. 1972 నుండి దేవాదాయ శాఖ అధికారులచే నియామకము కాబడిన కార్యనిర్వహణాధికారుల పరిపాలనా పరిధిలో కలదు. దేవాదాయ శాఖవారు భక్తుల సౌకర్యార్థము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టియున్నారు. ప్రస్తుతం దేవాలయము దినదినాభివృద్ధి చెందుతోంది.

ఉత్సవాలు మరియు పండుగలు

ప్రతి సంవత్సరము దేవాలయములో ధనుర్మాసములో తిరుప్పావై ఉత్సవము ఘనంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి నిత్యం తిరప్పావై ప్రవచనములు ప్రవచించెదరు. మరియు సామూహిక ఆకుపూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరము ఉగాడ్ శ్రీరామనవమి, హనుమ జయంతి, దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి, మక్కోటి ఏకాదశి మరియు సంక్రాంతి పండుగలు అతి వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరము మాఘమాసమునండ స్వామి వారికి లక్ష ఆకు పూజ జరుపబడును.

వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయము

ఈ ఆలయం పొన్నూరు పట్టణము నందు కలదు . పొన్నూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇచట ఎన్నో ప్రాచీన ఆలయాలు కలవు. వాటిలో వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయమొకటి. దీనిని పొన్నూరు ఆర్యవైశ్యులు క్రీ.శ. 1899 లో నిర్మింపచేశారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది. గర్భగృహం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలతో అలరారే ఈ ఆలయమునందు గర్భగృహమునందు వాసవీ కన్యకా పరమేశ్వరియేగాక, ఈశాన్య దిశయందు వినాయక విగ్రహము కలవు. వినాయకుడు విఘ్నములను తొలగించి, కార్యసిద్ధిని చేకూర్చుచుండునని, ఆలయ పండితుల ఉవాచ, ప్రజల విశ్వాసము. అందుచే ప్రతి ఆలయమందును వినాయకుని విగ్రహమొకటి ప్రతిష్ఠింపబడి ఉండును.

భీమేశ్వరాలయము

ఈ ఆలయం చేబ్రోలు గ్రామమందు కలదు. ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయము. ఈ ఆలయమును చాళుక్యుడు (892-921) కట్టించినాడు. విశాలమైన ఆవరణ, ఆవరణ చుట్టూ గంభీరమైన ప్రాకారం, ఆవరణ మధ్య ఈ భీమేశ్వరాలయము నూతన రీతులతో కన్పించుచుండును. బౌద్ధ చైతన్యం ఈశ్వరాలయముగా మారినందువల్లనో ఏమో ఇది ఒకే ఒక గర్భగృహం కలిగి ఉన్నది. ఆ గర్భగృహానికి ఈశాన్యంగా ఒక చిన్న గుడిలో బాలాత్రిపుర సుందరీ అమ్మవారు కలరు. ఈ రెండు ఆలయాలను కలుపుతూ పెద్ద మండపం కలదు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణ మార్గం కలదు. ఆ పెద్ద మండపంలో నందీశ్వరుడు కలడు. ఆ మండపం దాటిన తరువాత ఉన్నతమైన వేదిక కలదు. ఆ వేదికకు దిగు భాగాన మరొక నంది విగ్రహం కలదు.

శ్రీ గంగా పర్వత వర్ధనీ సమేత రామేశ్వరస్వామి దేవాలయం

ఈ ఆలయం తెనాలి పట్టణమందు గంగానమ్మ పేటలో కలదు. ఇది ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయము పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతున్నది. 1979 లో పునరుద్ధరణ కార్యక్రమం సమయంలో ఇచట జరిగిన త్రవ్వకాలలో బయల్పడిన ప్రాచీన బౌద్ధ విగ్రహము వల్లను అష్టాభుజ దుర్గ విగ్రహం వల్లను ఇది ప్రాచీనమైన ఆలయమని తెలియచున్నది. ఈ ఆలయం పడమర ముఖంగా ఉన్నది. దేవతల చేతగాని, మహానీయుల చేతగాని ప్రతిష్టింబడిన ఆలయాలు పడమర ముఖంగా ఉంటాయని కొందరు చెప్పుచుందురు. ఇది పరశురాముడు ప్రతిష్టించిన ఆలయం కనుక పడమర ముఖంగా ఉందని ఇక్కడి అర్చకులు చెప్పుచుందురు. ఈ ఆలయరంగు గర్భగృహంలో గోధుమ రంగు లింగాకృతిలో రామేశ్వరుడు దర్శనమొసగుచుండుట విశేష విషయం. ఆయనకు ఎడమ ప్రక్కన గల చిన్న గుడిలో గంగా పర్వత వర్ధనియు, కుడిపక్కన మరొక గుడిలో రత్నగర్భ గణపతియును, పరిసరాలలో నవగ్రహములు, అయ్యప్పస్వామి, నాగేశ్వర, సుబ్రహ్మణ్యేశర మూర్తులను దర్శనమొసగుచుందురు. ఆలయం ఆవరణలో ప్రాచీనమైన బౌద్ధ విగ్రహమును అష్టభుజదుర్గ విగ్రహమును, ప్రాకారము మీద జ్యోతిర్లింగ చిత్రాలును కన్పించును.

సహస్ర లింగేశ్వరాలయము

ఈ ఆలయం పొన్నూరునందు కలదు. ఇది నవీన ఆలయము. బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాధ దాసుగారు ఈ ఆలయమును 1955 లో ప్రారంభించి అచిరకాలంలోనే పూర్తిచేసి, ప్రజలకు అందించారు. ఈ ఆలయం ఆవరణలో మరో నాలుగు ఆలయములు కలవు. అందొకటి ఏకశిలా నిర్మిత ఆంజనేయస్వామివారి ఆలయము, రెండవది ఏకశిలా నిర్మిత గరుత్మంతుల వారి ఆలయము, మూడవది దశావతారాఆలయము, నాలుగవది కాలభైరవస్వామి ఆలయము. ఈ విధంగా ఇది అనేక ఆలయాల సంగమ ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచినది.

గంగా పార్వతీ సమేత నాగేశ్వరాలయము

ఈ ఆలయం చేబ్రోలు గ్రామమందు కలదు. పూర్వ ఈ గ్రామం తామ్రపురి’గా పిలుబడు చుండేది. క్రీ.శ. 1213 లో కాకతీయ గణపతి మహారాజు ఈ తామ్రపురిని జయసేనాపతికి దానం చేసినట్లు ఒక శాసనంలో కలదు. ఇచ్చట పల్లవుల ద్వారా శైవం బలపడింది. తూర్పు చాళుక్య భీముడు ఇచ్చట భీమేశ్వరాలయమును నిర్మించి శైవానికి విశిష్ట స్థానమొసగినాడు. తరువాత కాకతీయులు ఆ శైవాన్ని ఇచ్చట పెంపొందింపజేశారు. రుద్రమదేవికి సేనాపతియైన జాయపు నాయకుడు చేబ్రోలులో చిరకాలం నివసించాడు. అయనిరువురు చెల్లెండ్రు గణపతి దేవునకు మహారాణులుగా ప్రఖ్యాతిగాంచారు. శివభక్తుడైన అమరావతీ ప్రభువు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కాలంలో ఆయన ప్రధాన కేంద్రాలలో ప్రముఖ స్థానం వహించింది. ఇంత వైశిష్ట్యం గల ఈ గ్రామం తరువాత తామ్రపురి వదలి జయప్రోలు అయినది. ఒక శాసనంలో వివరించినట్టు ఈ చేబ్రోలు గ్రామంలో గల ప్రాచీనాలయాలలో ఈ గంగా పార్వతీ సమేత నాగేశ్వరాలయమొకటి పేరుగాంచినది. ఈ ఆలయము తూర్పు ముఖంగా ఉన్నది . గర్భగృహం, అంతరాలయము, మండపం అను మూడు భాగాలుగా ఉన్న ఈ ఆలయంలో గర్భగృహమందు నాగేశ్వరుడు దర్శన మొసగుచుండగా, అంతరాలయము ఎడమ భాగాన పార్వతీమాతయు, కుడి భాగాన మల్లేశ్వరుడును, మండపము చందు నందీశ్వరుడును దర్శనమొసగుచుందురు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *