గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం

ఈ ఆలయం నిడుబ్రోలు గ్రామమందు కలదు. ఇది ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయమును శాలివాహన శకం 1054 లో రాజేంద్రచోళుని మనుమడు త్రిభువన చక్రవర్తి అనే చోళరాజు నిర్మింపజేయించాడని తెలియుచున్నది.

ఈ ఆలయము తూర్పు ముఖంగా ఉన్నది. గర్భగృహం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలు గల ఈ ఆలయములో గర్భగృహమందు చౌడేశ్వరుడు దర్శనమొసగుచుండగా అంతరాలయంలో కుడి భాగాన పార్వతీ అమ్మవారును, ఎడమ భాగాన వీరభద్రుడును, భద్రకాళియు మండపంలో కుడి భాగాన కుమారస్వామియు, ఎడమభాగాన వినాయకుడును, మధ్యభాగంలో నందీశ్వరుడును దర్శనమొసగుచుందురు. ఎదురుగా ధ్వజస్థంభము కలదు. ఈ ఆలయ ఆవరణలో మరొక ఆలయం కలదు. ఆ ఆలయమును రాజ్యలక్ష్మీ సమేత కేశవాలయమని పిలుచుచుందురు. ఈ దేవాలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారు మండపంలో గరుడాళ్వారును దర్శనమిచ్చుచుందురు. ఈ ఆలయమునకు ఎదురుగా ధ్వజస్థంభము, ఆంజనేయుడును ప్రతిష్టింపబడి ఆరాధనలందుకొనుచున్నాడు.

శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, పొన్నూరు.

పొన్నూరులోని శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం చారిత్రాత్మక పౌరాణిక పుణ్య క్షేత్రంగా విరజిల్లుతోంది. హరిహర విభేదాలకు ముందుగా వెలసిన ప్రాచీన క్షేత్రాల్లో భావనారాయణ స్వామి దేవాలయం ఒకటి. గోష్ఠవనం, చక్రతీర్థం, స్వర్ణపురి, సుదర్శన క్షేత్రం అనే పేర్లు ఈ పొన్నూరు క్షేత్రానికి ఉండేవి. ఈ క్షేత్రంలో రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి విగ్రహాలు, నరసింహ స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీ భావనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, కాశీ విశాలాక్షీ దేవాలయాలలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన కళ్యాణోత్సవం జరుగుతుంది. సహస్ర లింగేశ్వరాలయంలో 12 అడుగుల ఎత్తున వున్న గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి.

బ్రహ్మేశ్వరాలయం, చేబ్రోలు

ఈ ఆలయం చేబ్రోలు గ్రామమందు కలదు. ఈ ఆలయమును రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించారని చెప్పుచుందురు. కొందరు మాత్రం అది అంతకు పూర్వమే కలదని, నాయుడు గారు దానికి కొంత పెరుగులు దిద్దారని చెప్పుచుందురు. ఈ ఆలయం సరోవరం మధ్యయందున్నది. అచటకు వెళ్ళేందుకు వీలుగా ఒక వంతెన మీదుగా వెళ్లి, ప్రజలు బ్రహ్మను దర్శించి వచ్చుచుందును. ఇచట బ్రహ్మ తనకు గల నాలుగు ముఖాలతో నలువైపుల చూచుచుండును. ఆ నాలుగు దిశలలో తూర్పు పడమర దిశలయందు శివాలయాలును, ఉత్తర దక్షిణ దిశలలో విష్ణ్వాలయాలును కలవు. అదేవిధంగా నాలుగు మూలలయందును నాలుగు దేవీ మూర్తులు ప్రతిష్టింపబడినవి.

శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, బాపట్ల

ఈ ఆలయం బాపట్లలో కలదు . ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయము శాలివాహన శకం 515 లో (క్రీ.శ. 594 లో) ప్రమాదీ నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు ప్రతిష్ఠింప బడినదని చరిత్రకారులు తెలియజేయు చున్నారు.

కాని స్థలపురాణం మాత్రం, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇచట బ్రహ్మర్షులు సమావేశమగు చుండేవారని, వారచట ఒక యాగకుండమును ఏర్పాటు చేసి అచట నారాయణుని స్మరించుచూ హోమం చేయుచుండేవారని అప్పుడు నారాయణుడు ఆయా యుగ ధర్మముననుసరించి, వేర్వేరు రూపాలతో వారికి దర్శనమొసగుచుండే వాడని, ఆ ప్రకారం నారాయణుడు ద్వాపరయుగంలో క్షీరవృక్షంలో శేషరూపం ధరించి వారిని ఆశీర్వదించాడని, తరువాత వచ్చిన కలియుగంలో ఎవరును క్షీరవృక్షంలో ఉన్న నారాయణుని కనుగొనలేకపోయారని, చెప్పుచూ, కలియుగంలో కుళోత్తుంగచోళదేవుడు దిగ్విజయ యాత్ర చేయుచూ ఈ ప్రాంతానికి వచ్చాడని, అపుడు వారి ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచు క్షీరవృక్షము ఆకులు తినబోగా, వాని తొండములు ఆ చెట్టుకు అంటుకొనిపోయి రాలేదని, రాజు ఆ వార్త విని అశ్చర్యం చెంది ఆ ప్రదేశానికి వచ్చి ఆ చెట్టును, ఆ చెట్టునంటుకొనిపోయి నిల్చుండియున్న ఏనుగులను చూచి, అది దైవమహిమయని గుర్తించి దైవాన్ని ప్రార్థించగా, అతడు తన విషయాన్ని తెలియజేసి, మీ ఏనుగులు చేసిన పాపానికి పరిహారంగా మీరు ఇచట ఒక ఆలయము కట్టించుమని ఇరువురు బ్రాహ్మణుల ద్వారా తన భావాలను తెలియజేసిన నారాయణుని, భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్టించి ఆరాధించాడని, అప్పటి నుండి ఆ ఆలయము భావనారాయణ ఆలయముగా ప్రసిద్ధిగాంచినది ఆ పురాణం వివరించుచున్నది.

శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవాలయము

ఈ ఆలయం గుంటూరు జిల్లాలో చంద్రవంక నదీతీరాన గల మాచెర్ల గ్రామమందు కలదు. ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయ నిర్మాణమెపుడు జరిగినది సరిగా తెలియకున్నను, అందరును వేయి సంవత్సరాలకు పూర్వమే నిర్మిణమైనదని చెప్పుచుందురు. ఈ ఆలయమునకు బ్రహ్మనాయునకు సన్నిహిత సంబంధం కలదని తెలియుచున్నది. విశాలమైన ఆవరణ, ఆవరణ చుట్టూ, కోటగోడవలె కన్పించే ఉన్నతమైన ప్రాకారము, ఆ ప్రాకారం లోపల ఆవరణలో మధ్యనొక అడ్డుగోడ, ఆ గోడకు ఉత్తర భాగము నందు లక్ష్మీ సమేత చెన్నకేశవాలయము, దక్షిణమునందు వీరభద్రేశ్వరాలయము మున్నగు ఆలయములు కలవు. ఉత్తర భాగమందున్న చెన్నకేశవాలయము గర్భగుడి, అంతరాలయం, మండపం అను మూడు భాగాలు కలిగి ఉన్నది. వానిలో గర్భగుడియందు చెన్నకేశవుడును, అంతరాలయమున లక్ష్మీ అమ్మవారును, మండవములో మరికొందరు దేవతామూర్తులును దర్శనమొనగుచు భక్తులను అలరింపచేయుచుందురు. ఆలయ ద్వారం గుండా లోపలకు వెళ్ళగానే, కన్పించేది చిన్న ధ్వజస్థంభం, ఆ ధ్వజస్థంభమునకు ఇరుపక్కల గరుత్మంతుడు, ఆంజనేయుడు, విరాజిల్లుచుందురు. తరువాత ఒక మండపం, ఆ మండపమునందే రంగవేదికయను పేరుతో ఒక నృత్య వేదిక కలదు. ఆ చుట్టూ రమణీయ శిల్పంగల నాలుగు స్థంభములు కలవు.

సీతానగరం ఆంజనేయస్వామి గుడి

ప్రకాశం బ్యారేజికి ఆవలి వైపున గల గుంటూరు జిల్లాలోని సీతానగరంలో కృష్ణానదీ తీరాన గత శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం అత్యంత పురాతనమైనది. ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభువు. ఇక్కడే కోదండ స్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి ఎగువన శ్రీ సోమేశ్వరస్వామి రాజేశ్వరీమాతలు ప్రతిష్ఠింపబడ్డారు. ఆంజనేయస్వామి ఆలయానికి ఎగువన నవగ్రహమూర్తులు, విఘ్నేశ్వరుడు కూడా ప్రతిష్ఠితమైన వున్నారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన పానకం సమర్పిస్తే సగం తిరిగి భక్తులకు అందివ్వటం అనేది ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం. శంఖంతో స్వామి వారికీ పోసే పానకం సగం వెనుకకు శంఖంలోనికి రావటం ప్రత్యక్షంగా గమనించదగ్గ విషయం.

అష్టలక్ష్మీ దేవాలయం

పాలకడలి నుండి ఉద్భవించి… శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కొలువుదీరి… జనావళికి సకల సంపదలను ప్రసాదించి, సుఖసంతోషాలతో జీవితాన్ని గడిపేలా చూస్తూవున్న చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి! అటువంటి శ్రీలక్ష్మీదేవిని ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్ములుగా ఆరాధిస్తూ వుండటం అనాది కాలం నుండి వస్తున్న ఆచారం. ధనం, ధాన్యం, విద్య, వైద్యం, విజయం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం అనే అష్టకామనలు తీరుస్తూ వున్న అష్టలక్ష్ములు కొలువుదీరి ఆరాధనలందుకుంటూ వున్న ఆలయం హైదరాబాద్ వాసవీ కాలనీలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయం.

వాసవీ కాలనీలో శ్రీ అష్టలక్ష్మీ ఆలయం నిర్మించడం వెనుక ఎంతో కృషి దాగియున్నది. వాసవీ కాలనీలో నివసించే ప్రజల సంక్షేమం కోసం అందరూ కలసి వాసవీ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు తమ కాలనీలో ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని ఏం ఆలయం కట్టాలో అర్థంకాక పరిపరి విధాల ఆలోచించి గణపతి స్థపతి గారిని సంప్రదించారు. ఆయన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో అసోసియేషన్ నాయకులు కంచికి వెళ్ళి స్వామి వారిని కలిశారు. వాసవీ కాలనీ వారి కోరిక విన్న స్వామివారు ఎంతో సంతోషించి అష్టలక్ష్మీ ఆలయం నిర్మిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్వామివారి సలహా మేరకు అష్టలక్ష్మీ ఆలయాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్న అసోసియేషన్ వారు అప్పటికే ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర మేరూరులోను, చెన్నై అడయారులోనూ వున్న అష్టలక్ష్మీ ఆలయాలను దర్శించి, పరిశీలించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అష్టలక్ష్మీ ఆలయ నిర్మాణానికి 1991 వ సంవత్సరం ఫిబ్రవరి 25 న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవార్లు భూమి పూజ నిర్వహించి శంఖుస్థాపన చేయగా, ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్మాణం పూర్తికాగా 1996 వ సంవత్సరం ఏప్రిల్ 28 న దేవతా మూర్తులను ప్రతిష్ఠించి, కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, శ్రీ త్రిదలు శ్రీమన్నారాయణ చినజీయర్ స్వాములవారు, ప్రతిష్టాకుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విధంగా నిర్మితమైన ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఆరాధనలందుకుంటూ ఉంది. వాసవీ కాలనీలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయం అద్భుతమైన నిర్మాణంలో ప్రశాంతమైన వాతావరణంలో, మహిమాన్వితమైన దేవతా మూర్తులతో, నయనానందకరంగా దర్శనమిస్తుంది. ఆలయం ఉత్తరాభిముఖంగా వుంది . ప్రధాన ద్వారాన్ని దాటుకుని ఆలయంలోకి ప్రవేశిస్తే రెండు అంతస్తులుగా ఆలయం దర్శనమిస్తుంది. క్రింది అంతస్తులో కార్యాలయం, వంటశాల తదితరాలు వున్నాయి. పై అంతస్థులో ప్రధాన ఆలయం ఉంది. సోపాన మార్గం ద్వారా పై అంతస్థుకు చేరుకోగానే సోపాన మార్గం సమీపంలోని చిన్న ఆలయంలో శ్రీ అభయ వినాయకుడు కొలువుదీరి పూజలందుకుంటున్నారు. వినాయకుడిని దర్శించుకుని ముందుకు వెళ్లే ప్రధాన ఆలయం, ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం వున్నాయి. మహామండపం, గర్భాలయ మండపాన్ని కలిగి ఉంది. గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దానికి చుట్టూ మరో ఏడు గర్భాలయాలు వున్నాయి. ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు శ్రీమన్నారాయణుడితో పాటు కొలువుదీరి దర్శనమిస్తాయి. శ్రీమన్నారాయణుడు, శ్రీ ఆదిలక్ష్మీదేవి, ఇద్దరూ చతుర్భుజాలను కలిగి శంఖు చక్ర అభయ, వరద మద్రలో దివ్యాలంకార శోభితులై కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఆలయానికి చుట్టూ, మూడువైపులా ఏడు గర్భాలయాలు వున్నాయి. ఈ గర్భాలయాల్లో శ్రీ సంతాన లక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, శ్రీ ఐశ్వర్య లక్ష్మి అమ్మవార్లు కొలువుదీరి, పూజలందుకుంటూ వున్నారు. గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి వుండడం వల్ల దర్శించుకున్నంతనే సర్వపాపాలు పరిహరింపబడతాయని, వీరిని దర్శించడం వల్ల అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయిని శాస్త్ర వచనం. ప్రతిరోజు పూజలు జరిగే శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విదియ మొదలు వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో శేష, హంస, గజ, గరుడ వాహన సేవలతోపాటు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పవిత్రోత్సవాలు, ష్యమాసంలో అధ్యయనోత్సవాలు, వివిధ పర్వదినాల సందర్భంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.

శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం, కర్మన్‌ఘాట్

కర్మన్‌ఘాట్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన కర్మన్‌ఘాట్ శ్రీ ధ్యానాంజనేయస్వామి అశ్రిత జన భక్తకోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు. కాకతీయ ప్రభువులచేత నిర్మించబడిన శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయుడు భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ యశోబుద్ధిబలాలను ప్రసాదించే భక్తవరదుడిగా విరాజిల్లుతున్నాడు. కోరిన కోర్కెలనెల్ల తీరుస్తూ, తనను సేవించిన వారికి భూతప్రేతపిశాచాల బారి నుండి కాపాడుతూ అభయ హస్తం ఇస్తూ భక్తుల గుండెల్లో కొలువు దీరుతున్నాడు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయానికి నగర వాసులే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. క్రీస్తు శకం 1143 నాటి గోల్కొండ దుర్గాన్ని పాలించిన రెండవ ప్రతాపరుద్రుని మొదలుకొని ఔరంగజేబు వరకు కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయుని సేవించారని పురాణాలు చెపుతున్నాయి. ఆనాడు నిర్మించిన కోనేరును మనం ఆలయం ఆవరణలో చూడవచ్చు. కార్థిక పౌర్ణమి రోజున భక్తులు తరలి వచ్చి కోనేరులో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఉగాది, శ్రీరామనవమి, కృష్ణ జయంతి వంటి పండుగలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు మంగళ, శనివారాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

చారిత్రక కథనం…

గోల్కొండ మహారాజు రెండవ ప్రతాప రుద్రుడు క్రీ.శ. 1143 లో తన సైన్యంతో ఇప్పుడు హైదరాబాద్ గా పిలువబడుతున్న నాటి చల్సింకు బయలుదేరాడు. వేటలో ఆలసి పోయి అరణ్య ప్రాంతమైన లక్ష్మీ గూడెం అనే గ్రామం సమీపంలోని ఉన్న ఇప్పటి కర్మమాటకు వచ్చి ఒక బండ రాయిపై విశ్రమించాడు. అదే సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. దీంతో రాజు ఉలిక్కిపడి గాండ్రింపు వచ్చిన దిశగా పరుగెత్తాడు. అక్కడ ఏమి కనిపించకపోవడంతో తిరిగి బండరాయి వద్దకు చేరుకోగానే పులి శబ్దం వినిపించింది.

మరోసారి పులి గాండ్రింపు వినిపించడంతో ఏమీ అర్థంకాని మహారాజు శబ్దం వచ్చిన దిక్కుగా దండం పెట్టుకుని విల్లంబులను కిందపడేసి వెనుదిరిగాడు. రెండడుగులు వేయగానే శ్రీరాం అంటూ మూడుసార్లు మేష గంభీర భీకర స్వరం వినిపించింది. దీంతో మరింత అయోమయానికి గురైన రాజు శబ్దం వచ్చిన దిశగా మరోసారి దండం పెట్టి నాకు కనుపించు తండ్రీ అని వేడుకోగా, ఓ రాజా నీ అంత్ర నేత్రంతో ధ్యాన దృష్టితో చూడు నేను కనిపిస్తాను అని శరీర వాక్కు వినిపించింది. అనంతరం రాజు పద్మాసనంలో ధ్యానేంద్రుడయ్యాడు. కొద్ది సేపటి తర్వాత ఇక లే నాయనా నేను కనిపిస్తాను.

అన్న వాక్కు వినిపించగానే రాజు కన్నులు తెరిచి శబ్దం వినిపించిన చోట ఆకులు, అలములు తొలగించి చూడగా స్వయంభూవుగా వెలసిన ఆంజనేయ స్వామి దివ్యవిగ్రహం కనిపించింది. దీంతో రాజు ఆనందపరవశుడయ్యారు. ఆంజనేయుడిని స్తుతించి కొద్ది సేపటి తర్వాత తిరిగి గోల్కొండకు వెళ్ళాడు. అదే రోజు రాత్రి కలలో మహారాజుకు ఆంజనేయుడు కనిపించి తన విగ్రహం దొరికిన చోటే దేవాలయం నిర్మించాలని ఆ స్థలం కర్మ క్షేత్రమని, రాబోయే రోజుల్లో కర్మన్‌ఘాట్ గా ప్రసిద్ధి పొందుతుందని ఆదేశించారు. స్వామి వారి ఆదేశానుసారం క్రీ.శ. 1143 లో హనుమాన్ జయంతి రోజున దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత వారికి నిత్య దీప, ధూప, నైవేద్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాక స్వామి వారికి పెద్ద ఎత్తున భూములను దానం చేసి తిరిగి ఓరుగల్లుకు వెళ్ళారు. స్వామి వారికి దానం చేసిన భూములపై వచ్చే ఆదాయంతో పాటు దారూర్, లాతూర్ నుంచి ఆలయ నిర్వహణ కోసం పైకం అందేది. రెండవ ప్రతాప రుద్రుడు కట్టించిన శ్రీ కర్మ సూట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయం ఆయన తర్వాత వచ్చిన కాకతీయ రాజులందరూ తమ ఇష్టదైవంగా ప్రతిష్ఠించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *