అద్దంకి శ్రీరామలింగేశ్వరుని దర్శించాలంటే ముందుగా హైదరాబాదు – మద్రాసు రైల్వేలైనులో ఉన్న ఒంగోలు పట్టణం చేరాలి. ఒంగోలు నుంచి అద్దంకి వెళ్లే బస్సులున్నాయి. పైగా నరసరావుపేట, వినుకొండ వెళ్లే బస్సులు అద్దంకి మీదుగా వెళతాయి.

క్రీ.శ .1324 నుంచి క్రీ.శ. 1434 వరకు తెలుగు సీమను పరిపాలించిన రెడ్డిరాజుల కాలంలో ప్రోలయవేమారెడ్డి అడ్డంకిని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించాడు. మహాభారతం అంద్రీకరించిన కవిత్రయంలోని ఎల్లాప్రగడ వీరి ఆస్థానంలోని వాడే, రెడ్డిరాజులు ప్రజోపయోగ కార్యాలను చేయటంతోపాటు ఎంతోమంది కళాపిపాసులను, కవి పండిత వరేణ్యులను పోషించి కళలకు ప్రాచుర్యం కల్పించారు. ఆ రోజుల్లో అద్దంకి వివిధ కవి, పండిత, నర్తక, గాయక సమూహాలతో, అచ్చెరువొందించే గొప్ప సౌధాలతో, విశాలమైన వీధులతో, ఉన్నత రాజ ప్రసాదాలతో విలసిల్లుతూ ఉండేదని వామన భట్టారకుడు తన రచనల్లో వివరించాడు.

ఇంతటి ప్రాచీన అద్దంకీ పట్టణంలో గుండ్లకమ్మ నదీతీరాన శ్రీరామలింగేశ్వరాలయం వెలసింది. ఇది చెప్పుకోదగ్గ శిల్పకళకి నిలయం. ఆలయంలో స్వామివారు, ఉత్తరాన పార్వతీ అమ్మవారు, దక్షిణాన నటరాజు, వీరభద్రుడు కొలువై ఉన్నారు. బయట నిలువెత్తు ఆంజనేయుడు, ఆయనకి తూర్పున విఘ్నేశ్వరుల విగ్రహాలు, పలు యక్షిణుల రూపాలు, శిథిల శిలాశాసనాలు ఉన్నాయి. ఇక్కడి స్వామిని శ్రీరామ చంద్రుడే ప్రతిష్టించాడనీ, తర్వాత దాన్ని అగస్త్యముని కూడా సేవించుకున్నారనీ చెబుతుంటారు. ఆంధ్రదేశానికి శ్రీరామచంద్రమూర్తికీ ఎంత సాన్నిత్యం ఉందో ఆంధ్రకీ, అగస్త్య మహామునికి కూడా అంతే సాన్నిహిత్యం ఉంది. బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మకుండి నదీ తీరాన చక్రాయణ, నృసింహ పుర, అద్దంకి పట్టణాలుండేవని తెలుస్తోంది.

పలువురు రాజుల పాలనలో ఉండిన ఈ ప్రాంతం రెడ్డిరాజులు, విజయనగర రాజుల కాలంలో అత్యున్నత స్థితిలో వైభవంగా వెలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *