నందివెలుగు అగస్తేశ్వరాలయం

ఆగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెప్తారు. అలా ఆయన ప్రతిష్టించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు. విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న తెనాలికి రైలు ద్వారా కానీ, బస్సులో కానీ చేరుకుని తర్వాత ఆటోలో పదిహేను నిమిషాలు ప్రయాణం చేస్తే నందివెలుగు చేరుకుంటాం. ఈ గ్రామం తెనాలిలోని భాగమే అని కూడా భావించవచ్చు. ఈ నందివెలుగు గ్రామం అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యం గల శైవ క్షేత్రం. ఏనాడో ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఈ లింగం, దేవాలయం కాలగతిలో దట్టమైన అడువులు పెరగడంతో మానవ సంచారం లేనిదై మరుగున పడిపోయాయి. చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఒకసారి ఈ అరణ్య ప్రాంతానికి రాగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. మహాశివభక్తుడైన విష్ణువర్ధనుడు ఈ అగస్తేశ్వర స్వామికి తేజఃపుంజాలతో నిత్యార్చన జరగాలని సంకల్పించి, అమూల్యమైన రత్నాలను వినాయకుని బొజ్జలోనూ, నందీశ్వరుని శృంగంలోనూ నిక్షిప్తం చేయించారు. వినాయకుడి బొజ్జలోని రత్నాల నుంచి వెలువడే తేజఃపుంజాలు నంది కొమ్ములలోని రత్నాల పైన పడి పరావర్తనం చెంది మూలవిరాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మాణం చేశారు ఆనాటి శిల్పులు. నంది కొమ్ములలోంచి వెలుగు రేఖలు రావటం వలన ఆ గ్రామం పేరే నంది వెలుగుగా మారిపోయింది. ఒక మంత్రవేత్త ఇక్కడికి వచ్చి, నందివెలుగు చేరుకుని నంది శృంగాలు, వినాయకుని గర్భమూ ఛేదించి రత్నాలు అపహరించాడట. మూలవిరాట్టు అగస్తేశ్వర స్వామి వారికి ఒకవైపు పార్వతీ అమ్మవారు, ఎదురుగా జ్యోతిర్నంది, ఓ పక్క జ్యోతిర్గణపతి, మరోవైపు శ్రీ ఆంజనేయస్వామి ఉన్నారు. వీరేకాక ఇంకా తల్లి శ్రీకనకదుర్గ రమాసహిత సత్యనారాయణ స్వామివారు నటరాజు, చండీశ్వరుడు, కాలభైరవులు, నవగ్రహాధిపతులు, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ కంఠ శివాచార్యుల వారు కూడా ఇక్కడ ప్రతిష్టితులై నిలచి ఉన్నారు.

శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం

కళలకు కాణాచిగా విద్యలకు, కళాకారులకు పేరెన్నికగా ధర్మదాతృత్వములకు పెన్నిధిగా స్వాతంత్ర్య సమర ప్రతిపత్తులకు సమజ్వలముగా శిల్ప నైపుణ్యములకు జేగీయ మానముగా “ఆంధ్రప్యారిస్” గా యావద్భారత ఖ్యాతిచెందిన “తెనాలి” పట్టణమునకు అంతర్భాగమై దక్షిణముగా రేపల్లె రైల్వే బ్రిడ్జి సమీపములో నిర్మితమైన శ్రీ వైకుంఠపురం వేంకటేశ్వర దేవాలయం భారతదేశంలోని దివ్యక్షేత్రములలో “ఒకటిగా నానాటికి ప్రసిద్ధికెక్కుచున్నది. శాంతికి, ప్రశాంతికి నిలయమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ దేవాలయం కమనీయంగానూ కన్నుల పండుగగానూ కామితార్థదాయకంగానూ విలసిల్లుచున్నది. నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లే కలియుగ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు భక్తాభీష్టవరదుడై లక్ష్మీ పద్మావతీ సమేతముగా ఈ దేవాలయంలో పరమ ప్రసన్న శోభలు చిందిస్తూ బహుముఖ వైభవోపేతుడై విలసిల్లుచున్నాడు. ఈ దేవస్థాన సంస్థాపకుల స్వప్నంలో పరంధాముడు వేంకటేశ్వరుడు ఫణిరాజరూపమున స్వప్నమున సాక్షాత్కరించి ఈ స్థలము పరమ పవిత్రమైనదనియూ సతాం పర్యటనేనైన తీర్ధిభూత భవం తీహీ అన్నట్లు పూర్వకాలమున మహనీయులైన మహర్షులెందరో, ఇందు మహత్తర తపోనిష్టా గరిష్టులై మహనీయ పుణ్యాతిశయమున పునీతంగావించినదనియూ ఈ స్థలం మందలి జలపానము సమస్థ పాప సంతాపహరమనియు సర్వ వ్యాధినివారక మనియు, సకలార్థ సిద్ధమనియు తనకీ స్థలము ప్రేమపాత్రమనియు తానందు వెలసితి వనియు నాగరాజు రూపమున భక్తులకు స్వయంగా సాక్షాత్కరమందించి వారికి నానాముఖ కామితార్థముల నందింతుననియు యీ దివ్యస్థలమున నాకొక దేవాలయము నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యెను. మహత్తర వైకానశ శాస్త్రాను సారముగ బహుముఖ శిల్ప చిత్రాచిత్ర విచిత్ర వినిర్మిత రమణీయ నూతన దేవాలయ మందు స్వామివారి ప్రతిష్టా మహూత్సవములు మహా వైభవముగా జరుగుచున్నవి. లక్షలాది భక్తుల మహూన్నతానంద కోలాహలములతో విలసిల్లుచున్నది.

శ్రీ జలపాలేశ్వర స్వామి దేవాలయం

ఈ దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. గుంటూరు నుండి 18 కి.మీ. దూరంలో నరసరావుపేట వెళ్ళే మార్గంలో వేమూలూరిపాడు అనే గ్రామంలో ఉన్నది. చోళ రాజులు తమ రాజ్య భాగాలను పరిశీలించడానికి సైన్యంతో బయలుదేరి అప్పుడు యాబలురిపాడుగా పిలువబడిన నేటి వేములూరిపాడు గ్రామానికి వచ్చే సరికి అర్ధరాత్రి సమయం అయింది. అపుడు ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. ప్రయాణానికి సమయం కాదని గ్రహించిన రాజు ఇక్కడే గుడారాలను నిర్మించుకొని రాత్రి బస చేయదలిచెను. అయితే వారికి చుక్క నీరు కూడా లభించలేదు. త్రాగునీటి కోసం సైన్యంతో ఇక్కడ బావిని తవ్వించాడు. అయితే నీటి చెమ్మ కూడా బావిలో దొరకలేదు. అపుడు ఇష్టదైవం పరమేశ్వరుని ప్రార్ధించిన వెంటనే స్వచ్చమైన జలంతో బావి నిండిపోయింది. అంతట ఈ ప్రదేశంలో జలపాలేశ్వర స్వామిగా శివలింగమును పార్వతీ దేవి విగ్రహాలను ప్రతిష్ట చేశారు. జలము శిరస్సున దాల్చి , తన అధీనము నుంచి సర్వసృష్టి అధిపతియై, లయకారకుడైన బోళాశంకరుడు భక్తుల కోర్కెలు తీర్చు శ్రీ జలపాలేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రతి యేటా జరుగుతున్నాయి. ఈ దేవస్థానం వాయువ్యమున రాజుల కాలం నాటి నీటి తొట్లు నేటి బొడ్రాయి వెనుక బజారు 1975 వరకు నాయకుల బజారుగా పిలువబడింది. ఈ దేవాలయం ఎడమప్రక్క రాతి శాసనము కలదు.

శాసనము వివరాలు…

1875 సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ సోమవారము పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్న సుముహూర్తంబున శ్రీ కుండినపురం గ్రామంలోని (అమీనాబాదు) దియాబలూరిపాడు (వేములూరుపాడు) గ్రామము శ్రీ వత్సరాఘవ శర్మచే దేవాలయం (జల పాలేశ్వరస్వామి) పునర్నిర్మాణ ప్రతిష్ట చేసినారని శాసనం వలన తెలియచున్నది. వీరి వంశస్థులే ఐదు తరముల నుండి అర్చకత్వము చేస్తున్నారు.

కైలాసగిరి క్షేత్రం…

ఇది గుంటూరు నుండి 11కి.మీ. దూరంలో పేరేచర్ల వద్ద 64 ఎకరాలు గల ఉరవకొండ పైన ఉంది. దీనిని శ్రీ కారుమూరి వీర రాఘవరావు గుప్త గారు 1972 సం., లో నిర్మించారు. కొండ పైకి కొంత దూరం మెట్లు కూడా కట్టించారు. ఘాట్ రోడ్ కూడా దాతల సహకారంతో వేయించారు. భక్తులు నెలనెలా ఇచ్చే విరాళాలతో స్వామి వారికి ధూప నైవేద్యములు చేయుచున్నారు. నాగేంద్ర స్వామి పుట్ట, నవగ్రహాలగుడి, కన్యకాపరపమేశ్వరి గుడి, వినాయకుడి విగ్రహం, కుమార స్వామి విగ్రహం ఉన్నవి. ఇక్కడ 30 అడుగుల రాతి ధ్వజ స్థంభం ఉన్నది. శివరాత్రికి లక్షలాది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. శివరాత్రి రోజు సుమారు 30 వేల మందికి అన్నదానం చేస్తారు. కార్తీక మాసం, తొలి ఏకాదశికి భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు.

దాసాంజనేయ స్వామి దేవస్థానం

ఈ దేవాలయం రాయల కాలంలోనే నిర్మించబడిందని స్థానికుల అభిప్రాయం. ఈ ఆలయ కట్టడాలను పరిశీలిస్తే శ్రీకృష్ణదేవ రాయలు నిర్మించిన మిగతా ఆలయాల కట్టడాలవలె కనిపిస్తాయి.

తాడికొండ దేవాలయాలు

తాడికొండ గ్రామం దేవాలయాలకు నిలయం. ఇక్కడ క్రీ.శ. 14 వ శతాబ్దంనకు ముందే ఈ ఆలయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ గ్రామానికి ఆది శంకరాచార్యులు వచ్చినట్లు ఇక్కడ లభించిన విగ్రహాలను బట్టి తెలుస్తుంది. ఈ గ్రామంలో “నవలింగాలను” ప్రతిష్టించారు. అవి 1. శ్రీ కొండ మల్లిఖార్జున స్వామి 2. శ్రీ చెన్నకేశవాలయం 3. శ్రీ గిరీశ్వరస్వామి 4. శ్రీ కొండ మూలశ్వేర స్వామి 5. శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి 6. శ్రీ రంగేశ్వర స్వామి 7. శ్రీ భవాని శంకర స్వామి 8. శ్రీ పేరేచర్ల మల్లిఖార్జున స్వామి 9. శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయాలున్నాయి. కాలక్రమేణా కొన్ని ఆలయాలు శిధిలమయ్యాయి. కేదారేశ్వర స్వామి ఆలయము జీర్ణావస్థకు చేరింది. పూర్వం ఈ గ్రామాన్ని “తాళాద్రి” అని పిలిచేవారు. అనగా తాడి చెట్లు మయమైన కొండ అని అర్థం. అందువలన దీనిని తాడికొండ అని పిలువబడింది. దీనిని పూర్వం తంత్రికొండ అని కూడా పిలిచేవారు. దీనికి కారణం దరణి కోటను పాలించే రాజులు యుద్ధ సమయాల్లో ఇక్కడ వున్న ఎత్తైన కొండ మీద నుంచి సూచనలు. సమాచార మార్పిడి, సిగ్నల్ వ్యవస్థగా ఉపయోగించుకునేవారు. ఉదాహరణకు 1. కొండమీద పొగ పెట్టడం : ఎవరైనా శత్రు రాజులు రాజ్యంపై దాడి చేయటానికి వస్తున్నపుడు కొండమీద “పొగపెట్టేవారు” 2. కొండ మీద “మంట పెట్టడం” – శత్రు సైన్యాలు దాడి చేసేటప్పుడు ప్రమాద సూచకంగా మంట పెట్టేవారు. తాడికొండ గ్రామంలో క్రీ.శ. 14 వ శతాబ్దానికే ముందు ఈ దేవాలయాలు ఉన్నట్లు గ్రామ పూర్వీకుల ద్వారా తెలుస్తుంది. ఈ గ్రామంలో పూర్వం “యోగులు” ఉండేవారు. జనసంచారం వలన పగటివేళ వారు శ్రీరంగా – భ్రమరాంబ సమేత కొండ మల్లిఖార్జున స్వామిని సేవించుకునేవారు. రాత్రి వేళ గ్రామంలో ఉన్న ఆలయాలను దర్శించుకునేవారు. కొండపైన గంగ తనకు తానుగా వచ్చినట్లుగా “మల్లెల దోన” , “ఏనుగుల దోన” అనే కోనేరులు ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం అంతా నీరు ఉంటుంది. కొండ మల్లిఖార్జున స్వామిని మల్లెలతో అభిషేకించిన తర్వాత ఆ మల్లెలను జనులు తొక్కకుండా ఈ మల్లెల దోనలో వేసేవారు . కొండ పైకి సుమారు 400 మెట్లు ఉన్నాయి. కొండ పైన హనుమంతుని పాదంగా చెప్పబడే “పాద ముద్ర” ఉన్నది.

క్వారీ దేవాలయం

ఇక్కడ స్వామి వారు బాల కోటేశ్వర స్వామిగా కొలవబడుచున్నారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ శివలింగం చోళుల కాలం నాటిది. కాల క్రమేణా కాల గర్భంలో మరుగున పడినది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ జరిగిన క్వారీ త్రవ్వకాలలో బయట పడినది. ఇక్కడ ఉన్న శివ లింగం మహిమన్వితమని భక్తుల నమ్మకం. ఇక్కడ కార్తీక మాసంలో పూజలు బాగా చేస్తారు. శివ రాత్రికి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలి వస్తారు. మిరుమిట్లూ, గొలిపే విద్యుత్ కాంతులతో ప్రభలు కట్టుకొని, శివ నామ స్మరణతో భక్తులు ఇచ్చటికి వస్తారు. ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ భక్తులు జాగారం చేస్తారు. ఈ దేవాలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది. ఇది గుంటూరు నుండి తెనాలి వెళ్ళే మార్గంలో గుంటూరుకు 14 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి దేవస్థానం

ఈ దేవాలయం గుంటూరు, కొత్త పేటలో 1896 సంవత్సరములో నిర్మించబడినది. ఈ ఆలయానికి స్థలంను ఇచ్చి, ఆలయ నిర్మాణం చేసినవారు నడింపల్లి రామయ్య గారు. ఈ దేవాలయంలో ఉమామహేశ్వరి స్వామి, బాల త్రిపురసుందరి దేవి కొలువై వున్నారు. మహ – గణాధిపతి, కుమార స్వామి, సత్యన్నారాయణ స్వామి, చండీశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి సూర్య దేవాలయం మరియు శంకరాచార్య దేవాలయం మొదలైన ఉపాలయాలు ఉన్నాయి. ఈ గుడి నవగ్రహాల పూజలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి శనివారం సుమారు 400 మంది ఇక్కడ నవగ్రహ పూజలు చేసుకుంటారు. చతుర్దశి రోజు ఇక్కడ కళ్యాణం, పౌర్ణమి రోజు పూర్ణాహుతి మరియు అన్నదానం జరుగును. విజయదశమి 10 రోజులు అమ్మవారిని 1. గాయత్రిదేవి 2 . బాల త్రిపుర సుందరి దేవి 3. చండి దేవి 4. అన్నపూర్ణ దేవి 5. కాళికాదేవి 6. లక్ష్మీదేవి 7. సరస్వతి దేవి 8. దుర్గాదేవి 9. మహిషాసుర మర్ధని 10. రాజ రాజేశ్వరి దేవి మొదలైన రూపాలలో అలంకరిస్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి. దీనిని అశ్వర్ధ నాగరీ వృక్షం అంటారు. వివాహాలు కానివారు ఎర్రటి వస్త్రంలో కందులు పెట్టి ఈ చెట్టు చుట్టూ తిరిగి, వాటిని దానం చేస్తే తొందరగా వివాహం జరుగుతుందని స్థానికుల నమ్మకం.

సోమేశ్వర స్వామి ఆలయం

శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవాలయం మరియు వీర భద్ర స్వామి దేవాలయం (వీరేశ్వర స్వామి) చాలా పురాతనమైన దేవాలయాలు. సోమేశ్వర స్వామి దేవాలయం రాయల కాలంలోనే నిర్మించబడినదని స్థానికుల అభిప్రాయం ప్రకారం వీరభద్ర స్వామి దేవాలయం కాకతీయుల నాటిదని తెలుస్తుంది. ఈ ఆలయం వద్ద కాకతీయులకు చెందిన ధ్వజ స్థంభం, శిలా శాసనం ఉన్నవి. సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ దేవరాయులకు చెందిన శాసనాలు ఉన్నవి. శ్రీ కృష్ణదేవరాయలు పేరు మీదనే ఈ గ్రామానికి “రాయపూడి” అనే పేరు వచ్చినది. శిధిలావస్థకు చేరిన ఈ దేవాలయాలను స్థానిక పెద్దలు మరియు స్థానికుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. సోమేశ్వర స్వామి దేవాలయాన్ని శైవ క్షేత్రం స్థాపకులు శ్రీ శివస్వామి చేతుల మీదుగా పునప్రతిష్ట చేశారు.

స్వయంభు లక్ష్మినరసింహ స్వామి దేవాలయం

గుంటూరు నుండి దక్షిణ – పడమరకు నరసరావు పేట రోడ్లో 6 కి.మీ. దూరంలో నల్లపాడు గ్రామము కలదు. దీనికి 1.68 కి.మీ. దూరంలో గుట్ట మీద స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కలదు. అందువలన ఈ గ్రామమునకు “నరసింహపురం” అనే పేరు వచ్చింది. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు కలవు. అగస్తేశ్వర స్వామి గుడికి ధ్వజ స్తంభము మరియు పంచ ఫణు భూగుల బొమ్మలు చెక్కబడి ఉన్నవి. శ్రీ శంకరాచార్య దేవాలయం దాని ప్రాచీనతకు ప్రసిద్ధమైనది. ఈ గుడి ఎత్తైన పాదములు చెక్కబడి ఉన్నవి.

శ్రీ చక్ర పీఠము

మహా చతుష్టష్టి కోటి యోగిని ఆశ్రమము. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన ఓం శ్రీ శ్రీ లలితా లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారి దేవస్థానము కలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *