జగదాంబ ఆంశతో ఉద్భవించిన నూటొక్క దేవతలు గ్రామ గ్రామాన వెలసి విశేష పూజలు అందుకుంటున్నారు. గ్రామ గ్రామాన ఒక్కొక్క పేరుతో వెలసి పూజలు అందుకుంటున్న నిన్ను ఏ రీతిన కొలవాలమ్మా అంటూ భక్తులు చేసే ప్రార్ధనలు గ్రామ దేవతల వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి. ఒక్కొక్క గ్రామ దేవతకు కథలు ఏవైనా కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా, అడిగిన వరములు ఇచ్చే తల్లిగా పాడి పంటలను కాపాడి సౌభాగ్యాన్ని ఇచ్చే గ్రామ దేవతలుగా భక్తులు అందించే పసుపు కుంకుమలను, నైవేద్యాలను స్వీకరిస్తూ చల్లగా కాపాడే కన్న తల్లులుగా ప్రసిద్ది చెందారు.

పవిత్ర కృష్ణా నదీ తీరాన అవనిగడ్డకు 10 కిలోమీటర్ల దూరంలో విశ్వనాధపల్లి గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు వెలిసింది. అమ్మవారి దివ్యకథ నిన్నమొన్న మాట కాదు, సుమారు 500 ఏళ్ళ నాటి మాట. కృష్ణాతీర ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలో పశువులకు మేత కూడా కరువైంది . అటువంటి పరిస్థితులలో పశువుల కాపరులు తమ యజమానులకు నచ్చచెప్పి పశువులనను నేటి ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి తోలుకుపోయారు. అద్దంకి ప్రాంతంలో కొంతకాలం పశువులకు మేత బాగానే దొరికింది.

తరువాత పశువులు అనూహ్యంగా మృత్యువాత పడ్డాయి. పశువుల కాపరులు బెంబేలెత్తిపోయారు. యజమానులకు నచ్చచెప్పి పశువులను తోలుకు వస్తే మృత్యువాత పడటం వారిని భయబ్రాంతులకు గురిచేసింది. పోయిన పశువులు పోగా, మిగిలిన పశువులనైనా రక్షించుకుందామన్న ఉద్దేశంతో పశువులను తిరిగి విశ్వనాథపల్లి తోలుకువచ్చారు పశువుల కాపరులు. అయినప్పటికీ మార్గ మధ్యంలో మరికొంత పశు నష్టం జరిగింది. కొంతమంది పశువుల కాపరులు విశ్వనాథపల్లి చేరుకుని జరిగిన నష్టాన్ని, అనుభవాన్ని గ్రామ పెద్దలకు వివరించారు.

ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక యువతి జుట్టు విరబోసుకుని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ నన్ను శాంతింప చేస్తే మీ కష్టాలు తీరుస్తానని పలకటంతో గ్రామస్తులు నీవెవరూ? నిన్నెలా శాంతింప చేయాలి అని ప్రశ్నించారు. పూనకం వచ్చిన ఆ యువతి నేను అద్దంకి నాంచారమ్మను నేను అద్దంకి నుంచి పశువుల కాపరుల వెంట వచ్చాను. తనకు తృప్తి కలిగించి పూజలు చేస్తే కష్టాలు తీరుస్తానని, పాడి పంటలు దక్షిస్తానని మాట ఇచ్చింది. అప్పటికే తీవ్ర నష్టానికి గురైన గ్రామస్తులు ఏదైతే అయ్యిందని భావించి అమ్మవారిని తమ కులదేవత గావించుకున్నారు. కొండవీటి ఇంటి పేరు గల కుటుంబీకులు అమ్మవారికి చిన్న ఆలయం కట్టించి అందులో ప్రతిష్టించారు.

వైభవంగా నాంచారమ్మ జాతర

ప్రతి ఏటా అమ్మవారికి పాల్గుణ మాసం పున్నమి రోజున వైభవోపేతంగా జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారులలో ఒకరైన కొండవీటి కొండలు తెలిపారు. జాతర మహోత్సవానికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు లక్షలాదిగా తరలివచ్చి అమ్మవారికి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వేలాదిమంది భక్తులు కృష్ణా నదిలో స్నానమాచరించి నాంచారమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

విశిష్టత కలిగిన శివరామకృష్ణ క్షేత్రం

విజయవాడ వాసులు ఆధ్యాత్మిక, వైదిక, ధార్మిక, పురాణ ఇతిహాస కార్యక్రమాలను తిలకించేందుకు ప్రస్తుతం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అప్పట్లో కామకోటి ఉత్సవాలను నిర్వహించారు. ఆ తరువాత తమ్మలపల్లి హరినారాయణ రామకోటి ఉత్సవాలు జరుగుతున్న మైదానంలో ఒక కళాక్షేత్రాన్ని నిర్మించటానికి ఆ స్థలాన్ని కేటాయించటంతో విజయవాడ వాసులకు ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ జరిగింది.

ఆనాటి నగర పెద్దలు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలోకి సుమారు 6 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని దాతల సహాయంతో సేకరించారు. ఈ స్థలానికి రామకోటి ఉత్సవ స్థలంగా తిరిగి నామకరణం చేశారు. అక్కడ శివుడు, రాముడు, కృష్ణుడు, అమ్మవారి విగ్రహాలు, ఆంజనేయస్వామి, నవగ్రహాలు తదితర హిందూ సాంప్రదాయ దైవీ శక్తుల రూపాలను ప్రతిష్ఠించటంతో దీనికి శివరామకృష్ణ క్షేత్రంగా పేరొచ్చింది. కాలక్రమేణా ఇక్కడ దేశవ్యాప్తంగా పేరొందిన త్యాగరాయ ఆరాధనోత్సవాలు ప్రతియేటా క్రమం తప్పకుండా దాదాపు వంద ఏళ్లుగా వస్తున్న రామకోటి ఉత్సవాలను కూడా నిర్వహించటంతో శివరామకృష్ణ క్షేత్రానికి విశిష్టత ఏర్పడింది. ఇక్కడ నిత్యం ధార్మిక కార్యక్రమాలు, పూజలు, యజ్ఞాలు, హోమాలు నిర్వహించటం పరిపాటిగా వస్తున్నది.

దక్షిణాన ప్రసిద్ధి పార్శ్వనాథ దేవాలయం

దక్షిణ భారతదేశంలోని జైన దేవాలయాల్లో ప్రసిద్ధి చెందింది గుడివాడలోని పార్శ్వనాథ దేవాలయం. క్రీ.శ. 1300 సంవత్సరం నుంచి కాకతీయుల కాలం వరకు ఈ ప్రాంతం జైన మత కేంద్రంగా విలసిల్లింది . నాటి కాలంలోని పార్శ్వనాథ విగ్రహాన్ని జీర్ణోద్ధరణ చేసిన జైన దేవాలయంలో నేటికీ చూడవచ్చు. సుమారు 75 ఏళ్ల కిందట వరకు ఈ విగ్రహం స్థానిక భీమేశ్వరాలయంలో ముఖం వరకు భూమిలో ఉండి శివలింగాకారంగా ఉండి పూజలు పొందింది. దీనిపై ఉన్న పడగలను నాగేంద్రస్వామివిగా భావించి భక్తులు కొలిచేవారు. విగ్రహాన్ని వెలికితీయగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పార్శ్వనాథ విగ్రహం బయటపడింది.

ప్రభుత్వ అనుమతితో జైనశ్వేతాంబరులు దీనిని భీమేశ్వరాలయం పక్కనే నెలకొల్పిన జైన దేవాలయంలో ప్రతిష్టించారు. అదే దేవాలయంలోని ఉపాలయంలో మరో చిన్న పార్శ్వనాథ విహం, మహావీరస్వామి, నేమినాథ్, సేయంస నాథ్ స్వామి విగ్రహాలు నెలకొల్పి జైన శ్వేతాంబరులు పూజలు చేసి తరిస్తున్నారు. పార్శ్వనాథ్ చిన్న విగ్రహం రాజమండ్రి వద్ద గోదావరిలో లభ్యంకాగా దానిని జైన శ్వేతాంబరులు తీసుకువచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారు. గుడివాడలో జైన శ్వేతాంబరుల కుటుంబాలు సుమారు 100 వరకు ఉన్నాయి. జైనధర్మాన్ని మొట్టమొదటిగా జినేశ్వరుడు స్థాపించారు. ‘జిన’ అనే పదానికి విజేత అని అర్థం. మాత్సర్యం మొదలైన అంతరంగిక శత్రువును గెలిచినవాడే జినుడు. ప్రాచీన సంస్కృతిలోని మూలభూత తత్వాలు సత్యం, జ్ఞానం జైన ధర్మాలకు ఆధారాలు. పార్శ్వనాథ్ దేవాలయం జైన పుణ్యక్షేత్రమే అయినా సర్వమతాల భక్తులు దీనిని దర్శించడం విశేషం.

దక్షిణాది ‘ పూరి ‘ వడాలి

జగన్నాధస్వామిని కొలవాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒరిస్సా రాష్ట్రంలోని పూరికి వెళ్లాల్సిందే. మరో పూరిని దర్శించాలంటే మన రాష్ట్రంలోని ముదినేపల్లి మండలం వడాలికి విచ్చేయాల్సిందే. ఇందుకు ఈ గ్రామంలోని జగన్నాదస్వామి దేవాలయం దక్షిణాది పూర్తిగా జగత్ ప్రసిద్ధి చెందడమే కారణం. 200 ఏళ్ళ క్రితం వడాలిలో నిర్మించిన జగన్నాధస్వామి ఆలయం నాడు రెండో పూరిగానే ప్రసిద్ధికెక్కింది. అంతులేని భూ సంపద, అశేష భక్తజనావళి సందర్శనతో స్వామి ఇష్టకామ్యార్ధ సిద్ధిగా విలసిల్లాడు. నేడు లక్షలాది రూపాయల వ్యయంతో జరుగుతున్న పునర్నిర్మాణంతో ఆలయం ముమ్మూర్తులా పూరి దేవాలయాన్నే పోలి ఉండడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తునారు. మరో విశిష్ఠత ఏమిటంటే ముస్లిం నవాబు కానుకగా ఇచ్చిన భూములతో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది.

ముదినేపల్లి మండలం వడాలిలో గుడివాడ – బంటుమిల్లి ప్రధాన రహదారికి అతి దగ్గరలో కొలువైన బలరామ, సుభద్ర సమేత జగన్నాధ స్వామి మహిమాన్వితులు. ఒకనాడు 1200 ఎకరాల సుక్షేత్ర భూములను హైదరాబాద్ నవాబు స్వామికి కానుకగా ఇవ్వగా నేడు వాటిలో మూడొంతులకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి. శిధిలావస్థకు చేరిన ఈ దేవాలయం నేడు అత్యంత వైభవంగా పునర్నిర్మాణం జరుపుకుంటోంది. త్వరలో భక్తజనులకు దర్శనీయ క్షేత్రం కానుంది.

ఆలయ చరిత్ర – పురాతన వైశిష్ట్యం

సర్వమత ధర్మాలు ఒక్కటే అని భోదించే సార్వజనీయమైన త్యాగం ఈ దేవాలయ నిర్మాణంలో మనకు కన్పిస్తుంది. అది 1765 వ సంవత్సరం. ప్రకాశం జిల్లా కర్రపాలేనికి చెందిన పురుషోత్తమానంద అవదూతస్వామి వడాలిలోని జగన్నాధస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. వైష్ణవ భక్తుడైన అవదూత స్వామికి పూరి జగన్నాధస్వామి కలలో కనిపించి ఈ ప్రాంతంలో తనకు గుడి కట్టించమని ఆదేశించారు.

ఆలయ నిర్మాణం కోసం వెతుకుతున్న సమయంలో విన్నకోట పరగణాగా భావించే సన్నపాదు… చేరుకోగా ఆ ప్రదేశం ఆలయ నిర్మాణానికి సరైందిగా భావించిన అవధూత స్వామి ఆ స్థలం ఎవరిదని వాకబు చేసి నిజాం అనుమతి కోసం బయలుదేరి వెళుతూ విజయవాడ వద్ద కృష్ణానదిలో సన్నపాడు గ్రామస్థులతో కలిసి స్నానం చేస్తున్న అవదూత స్వామి ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు. గ్రామస్థులు వెదికి వెదికి తిరిగి నిరాశతో గ్రామానికి తిరిగి వచ్చారు.

కృష్ణానదిలో అదృశ్యమైన అవధూత స్వామి తన శక్తిచే హైదరాబాద్ నిజాం నవాబు అంతఃపురంలో ప్రత్యక్షమయ్యారు. దాంతో నవాబు ఆశ్చర్యచకితుడై వచ్చిన కారణమేమిటని అడుగగా జగన్నాధస్వామి దేవాలయ నిర్మాణం జరపాలనుకున్నామని, అందుకు కావాల్సిన స్థలాన్ని తనకు ఇవ్వాలని కోరారు. అందుకు సమ్మతించిన నవాబు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు ఎంతదూరం తిరగగలిగితే అంత స్థలం మీకు దేవాలయానికి విరాళంగా అందిస్తానని హామీ యిచ్చారు. అవధూత స్వామి వడాలిలోని ప్రాంతంలో 1200 ఎకరాల పరిదిలో తిరిగి ఆ భూమిని దేవాలయానికి అప్పగించారు. నిర్మాణం పూర్తిచేసి పూరి నుంచి మూలవిరాట్ విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించారని భక్తుల కధనం. నాడు దట్టమైన అడవితో బోయలు నివశించే ఈ ప్రదేశాన్ని ‘వ్యాధాళి’ అనేవారని కాలక్రమేణా అదే వడాలిగా నామాంతరం చెందినట్లు నానుడి.

శతాబ్దాల చరితం అగస్తేశ్వర ఆలయం

కృష్ణా జిల్లాలో గల అగస్తేశ్వరస్వామి దేవాలయం ఈ ప్రాంతంలో పురాతనమైందిగా చారిత్రక ఆదారాల ద్వారా వెల్లడవుతోంది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అగస్తేశ్వర మహాముని ఈ ఆలయాన్ని నిర్మించి కైలాసనాధుడ్ని ప్రతిష్టించినట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. అగస్తేశ్వర మహాముని ప్రతిష్టించిన కారణంగా ఈ ఆలయం అగస్తేశ్వరస్వామి ఆలయంగా వాసికెక్కింది. సుమారు 150 సంవత్సరాల క్రితం పెడనకు చెందిన బసవన్న రుద్రమాలిక చదువుగా వర్షం పడినట్లు ప్రతీతి. ఆ కారణంగానే అగస్తేశ్వర రుద్రమాలిక శిలాక్షరాలుగా గోడలపై చెక్కించినట్లు ఇప్పటికి చెక్కుచెదరక అలానే ఉన్నాయి. ఈ ఆలయానికి దేవతాసర్పం కూడా వస్తుండేదని ప్రతీతి. ఆ కారణంగానే భక్తులు నాగులచవితి నాడు విశేషంగా దేవాలయాన్ని సందర్శిస్తారు. మొగల్తూరు జమిందారులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పర్చినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. సింగరాజు అంబయ్య దేవాలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.

ఆలయ ప్రాంగణంలో అగస్తేశ్వరుడు, వీరభద్రుడు, గంగా పార్వతి దేవాలయాలు ఉన్నాయి. దశాబ్దాలు నిరాదరణకు గురైన ఈ ఆలయాన్ని 1980 నుంచి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. శివరాత్రి, ముక్కోటి ఏకాదశిలను ఘనంగా నిర్వహిస్తారు. అభినవ శ్రీశైలంగా విరజిల్లుతోన్న ఈ ఆలయాన్ని ఆ సమయంలో వేలాదిమంది దర్శిస్తారు.

శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, వేదాద్రి

ప్రశాంతమైన అరణ్య మధ్యమున , కృష్ణవేణి తరంగ నాదములతో ప్రకృతి సహజసిద్ధ సౌందర్యములను నిండుగా అలంకరించుకొని భక్తకోటి ముక్తియే వేదాద్రి గా అలరారుతోంది.

స్థలపురాణం

పూర్వకాలంలో బ్రహ్మదేవుని నుండి వేదాలను సోమకారసుడను రాక్షసుడు తస్కరించి సముద్రమందు దాక్కున్నాడు. బ్రహ్మ తన జనకుడైన శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి, జరిగింది వివరించి, వేదాలను తిరిగి అనుగ్రహించాలని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను కాపాడాడు. వేదాలు పురుష రూపం ధరించి “దేవా ! మమ్ము కరుణించి తరింప జేయుము” అని ప్రార్థించగా… నేను హిరణ్య కశపుణ్ణి సంహరించడానికై నృసింహావతారం ధరిస్తాను. అప్పుడు మీ శిరస్సులపై నేను పంచమూర్తియై మీ శిరస్సులపై నివసిస్తాను. అప్పటి వరకు మీరు కృష్ణవేణి గర్భంలో సాలగ్రామ స్వరూపంలో ఉండండి. మీవలెనే కృష్ణవేణి కూడా ప్రతిరోజు నన్ను అభిషేకించాలని ప్రార్థిస్తోంది. ఆమె కోరిక కూడా ఈ విధంగా తీరుతుంది”. అని అనుగ్రహించగా వేదాలు ఎంతో సంతోషించి, సాలగ్రామ రూపంలో కృష్ణా నదిలో వుండసాగాయి.

అనంతరం నారాయణుడు నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి జ్వాలా నరసింహమూర్తియై పర్వత శిఖరంపై నివసించసాగాడు. ఈ విషయం తెలిసిన బ్రహ్మ సత్యలోక మందు సాలగ్రామ నారసింహ స్వరూపంతో వేంచేసి అనుగ్రహించమని వేడుకోగా, స్వామి తథాస్తని సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ పూజ చేయుటం మొదలు పెట్టిన వెంటనే సత్యలోకం మంటల్లో దహించుకుపోవడం ప్రారంభించటంతో భయభ్రాంతుడై స్వామిని మరల కృష్ణవేణి గర్భమందున్న సాలగ్రామ పర్వతంపై ప్రతిష్టింప చేసాడు. అనంతరం ఋషులు, మనువు ఆదిగా గల మహారాజుల ప్రార్థనకు సంతుష్టుడై యోగానంద నృసింహస్వరూపుడై వెలసి విలసిల్లుచున్నాడు. ఈ క్షేత్రం పంచనారసింహ (జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహామూర్తుల) క్షేత్రమైన వేదాద్రిగా పిలువబడుచున్నది.

కలియుగ ప్రారంభంలో కరువుకాటకాలు ఏర్పడటంతో ఋషులంతా వ్యాసుడి బోధతో తనున్న చేయాలని భావించి అందుకు అనుకూలమైన ప్రదేశం కోసం వెదుకుచుండగా, ఆంధ్రప్రదేశమును విని, అక్కడికి వస్తుండగా దారిలో నదీతీరం వెంబడి సుస్వరోచ్చారణమున వేదమంత్రాలు వినబడ్డాయి. కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రం కలదని, అక్కడ తపస్సు చేస్తే ముక్తి సాధ్యమవుతుందని ప్రకృతే ఆవిధంగా వేదాలను పరిస్తోందని తెలుసుకుని, ఆశ్చర్యపోయారు . సమీపంలోని ఒక పర్వతం నుండే ఈ ధ్వని వినిపిస్తోందని నిశ్చయించుకొని ఆ పర్వతానికి ప్రదక్షిణలు చేసారు . “ఋషులాం ! ఇదే వేదగిరి ఇందు శ్రీమన్నారాయణుడు నృసింహరూపంలో ఆర్చామూర్తియై వెలసినాడు. వారిని సేవించండి” అనే అశరీరవాణి మాటలు వినబడ్డాయి. వారు అట్లే వెళ్ళి స్వామివారిని కనుగొని, సేవించి తరించారు.

తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం రెడ్డిరాజులచే నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, నారాయణ తీర్థులు తదితర మహానుభావులు దర్శించి పునీతులయ్యారు.

శ్రీరంగ నాయకస్వామి వారి దేవస్థానము

శ్రీరంగనాయక స్వామి వారి దేవస్థానమును 200 సంవత్సరములకు పూర్వము బొమ్మదేవరపల్లి జమిందారు నిర్మించారు. బందరులో కొంత మెరక భూమిని వెచ్చావారు, వైశ్యులు దానం చేసిరి. రాబర్ట్ సన్ అను దొరవారు కృష్ణాజిల్లా కలెక్టరుగా పనిచేసినప్పుడు దేవస్థాన అభివృద్ధికి కృషి సల్పిరి. ఈ దేవస్థానమందు వైఖాసన ఆగమశాస్త్ర ప్రకారము నిత్యపూజా కార్యక్రమము జరుపబడుచున్నవి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాయకస్వామి వారు ఈ ఆలయమున కొలువై పూజలందుకొనుచున్నారు.

ధనుర్మాసము, ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవములు, గోదా కళ్యాణమునకు భక్తులు ఆధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించెదరు. ఈ దేవాలయములో శ్రీ ఆంజనేయ స్వామి వారు. శ్రీ గురుత్మంతుల వార్ల ఉపాలయములు ఉన్నవి. శ్రీ స్వామివారికి కళ్యాణ మండపము కలదు. విశాలమైన ఆవరణలో తులసివనం కలదు. జ్యేష్ట మాసములో వార్షిక బ్రహ్మోత్సవములు జ్యేష్ఠ శుద్ధ దశమి మొదలు బహుళ తదియవరకు రంగ రంగ వైభవముగా జరుగును. ఇవిగాక ఉగాది, శ్రీరామనవమి, తొలి ఏకాదశి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం మొదలైన పండుగలు వైభవముగా జరుగును. స్వామి వారి దేవస్థానములో వివాహము చేసుకొని, స్వామివారిని దర్శించుకున్న కొత్త దంపతులకు తప్పక సంతానప్రాప్తి కలుగునని భక్తుల నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *